ఏపీకి అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2021-12-12T23:11:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ...

ఏపీకి అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి: పవన్ కల్యాణ్

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘అమరావతినే రాజధాని అని మోడీ, అమిత్‌షా అన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వ్యతిరేకించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పవద్దు. ప్లాంట్‌ విషయంలో రాష్ట్రం స్పందించకుంటే కేంద్రం ఎందుకు పట్టించుకుంటుంది. బీజేపీ దగ్గర నా మాటకు గౌరవం ఉండొచ్చు కానీ 22 మంది ఎంపీల మాట కేంద్రానికి శాసనం. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు?. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ సభల్లో నిరసన తెలపాలి.’’ అని డిమాండ్ చేశారు. 




విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలపక్షాన్ని ఏపీ ప్రభుత్వం ఢిల్లీ తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. పదవులు ఆశించకుండా సేవలు చేసిన మహనీయులే ప్రేరణ అని చెప్పారు. తాము ప్రజాక్షేమం కోరుకునేవాళ్లమన్నారు. పాలసీలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని తెగేసి చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం తమ ఉద్దేశం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 150 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ అంటే పోరాటానికి విలువ లేకుండా చేయడం ఓట్లు వేసి గెలిపించకపోయినా ప్రజల కోసం నిలబడ్డామని పవన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-12T23:11:40+05:30 IST