Please సీఎం అని అరవకండి.. అలసిపోయా.. : Pawan Kalyan

ABN , First Publish Date - 2021-10-02T19:47:23+05:30 IST

ఓ వైపు వర్షం.. మరోవైపు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని ...

Please సీఎం అని అరవకండి.. అలసిపోయా.. : Pawan Kalyan

కాకినాడ : ఓ వైపు వర్షం.. మరోవైపు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు.. అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. అభిమానులు, నేతలతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.


అరవకండి.. చేసి చూపండి..!

పవన్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపి..‘ ఒక్క నిమిషం ఆగండి.. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు (కార్యకర్తలు, అభిమానులు) మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి..’ అంటూ సభకు తరలివచ్చిన కార్యకర్తలకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


నాకేం సరదా కాదు..

ఏపీలో ప్రజాస్వామ్యంగా పనులు జరగడం లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. వంగేది లేదు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత. నేను సీఎం కావాలని మనసులో కోరుకోండి. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదు. రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు అని జనసేనాని చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-10-02T19:47:23+05:30 IST