Aug 2 2021 @ 21:21PM

మహేష్ కంటే ఒకరోజు ముందే పవన్.. ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. రీసెంట్‌గా మహేష్ బాబు చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ చిత్ర రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2022, జనవరి 13న ‘సర్కారు వారి పాట’ చిత్రం విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ కంటే ఒక రోజు ముందే అంటే 2022, జనవరి 12న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. వీరిద్దరితో పాటు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ చిత్రాన్ని 2022, జనవరి 14న విడుదల చేస్తామని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. ఈసారి సంక్రాంతి ఫైట్ మహారంజుగా ఉండబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఇక విడుదల తేదీల ప్రకటనలు వచ్చిన తర్వాత ఈ హీరోల అభిమానులు కూడా ఈ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.