Jul 30 2021 @ 16:25PM

ఇక మీ నటన కోసం ఉవ్విళ్లూరుతారు: పవన్ కల్యాణ్

శతాధిక చిత్రాల దర్శకుడైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటోన్న ‘పెళ్లిసందD’ చిత్రంతో దర్శకేంద్రుడు నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, చిత్రానికి సంబంధించిన ఆయన ఫస్ట్ లుక్‌ను ఆయన శిష్యుడైన దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడిగా ఎన్నో అపూర్వమైన విజయాలను అందించిన కె. రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో.. సెలబ్రిటీలంతా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘కెప్టెన్ ఆఫ్ ద షిప్’గా ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో..

‘‘శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి,

నమస్సులు 

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండితెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు.

కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్... కెమెరా... యాక్షన్...’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్రరావుగారు నటులు రాఘవేంద్రరావుగారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో... ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు.

ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 

విష్ యూ ఆల్ ద బెస్ట్’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. కాగా.. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం ‘పెళ్లిసంద‌D’. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.