రెహమాన్‌ చెప్పిందే.. పాటిస్తా : పవన్‌కుమార్‌ సీహెచ్‌

‘‘నీకు నచ్చిందే చెయ్‌! – నాకు రెహమాన్‌గారు ఇచ్చిన సలహా ఇది. ‘నీ మీద నీకు నమ్మకం ఉండాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే పైకొస్తావ్‌’ అని చెప్పారు. ఆయన దగ్గర పని చేసి నేనెంతో నేర్చుకున్నా’’ అని సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ అన్నారు. ఛాయాగ్రహకులు విజయ్‌ సి. కుమార్‌ తనయుడు ఈయన. ‘లవ్‌స్టోరి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ము ల దర్శకత్వంలో నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్ర శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవన్‌ విలేకర్లతో మాట్లాడారు. 


మా తాత, నాన్న విజయ్‌ సి.కుమార్‌ ఇద్దరూ సినిమాటోగ్రాఫర్లు. అయినా నాకు సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్‌ ఉండేది కాదు. హైదరాబాద్‌లో నాకున్న స్నేహితులంతా సంగీత  నేపథ్యం ఉన్నవారే. వారితో అప్పుడప్పుడు స్టూడియోలకు వెళ్తుండేవాణ్ణి. వాళ్లతో ఉన్నప్పుడు నాకూ సంగీతం మీద ఆసక్తి మొదలైంది. నేను చేసిన ఓ ర్యాప్‌ సాంగ్‌ విని మా కుటుంబ సభ్యులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. చెన్నైలో ఓ స్టేజి షోలో నేను స్వరపరిచిన మూడు పాటలు ఉపయోగించారు. దానికి ఏఆర్‌ రెహమాన్‌ వచ్చారు. నా సౌండ్‌ నచ్చడంతో ఆయన బృందంలో పని చేసే అవకాశం కల్పించారు. సంగీత కళాకారుడిగా ‘మామ్‌’ నా తొలి సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘రోబో’, ‘ఫకీర్‌ ఆఫ్‌ వెనిస్‌’ తదితర చిత్రాలకు పని చేశా. అలా చేస్తున్నప్పుడే... ఈ సినిమా అవకాశం లభించింది.


ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడతా..

మొదట శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’కు ప్రయత్నించా. నేను చేసిన కొన్ని బాణీలు వినిపించా. ఇంకా నేర్చుకోమన్నారు. ‘లవ్‌ స్టోరి’కి అవకాశం ఇవ్వడానికి ముందు కొన్ని సందర్భాలు చెప్పి బాణీలు కట్టమన్నారు. ఓ పది, పదిహేను చేశాక... అవకాశం ఇచ్చారు. అప్పటికి రెహమాన్‌గారి దగ్గర ‘సర్కార్‌’, ‘నవాబ్‌’ పనులు జరుగుతున్నాయి. రెహమాన్‌ దగ్గర పని పూర్తి చేసుకుని ఉదయం ఐదున్నరకు ఇంటికొచ్చి ‘లవ్‌ స్టోరి’ పాటలు చేసేవాణ్ణి. రెండు మూడు నెలలు అలా వర్క్‌ చేయడంతో అనారోగ్యానికి గురవడంతో ‘నేనొక చిత్రానికి పని చేయడం ప్రారంభించా’ అని చెప్పా. అప్పుడు ‘ఆల్‌ ద బెస్ట్‌’ చెప్పి పంపించారు. శేఖర్‌ కమ్ముల ఇచ్చిన సపోర్ట్‌తో ‘లవ్‌ స్టోరి’లో విభిన్నమైన బాణీలు అందించే అవకాశం లభించింది. 


వివాదం గురించి నాకు తెలియదు...

జానపద గీతం ‘సారంగ దరియా’ని నాకు ఓసారి చూపించారు. కానీ, సినిమాలో పెట్టాలని ముందు అనుకోలేదు. తర్వాతి చర్చల్లో దీన్ని రీ క్రియేట్‌ చేయాలన్నారు. ఆ ప్రయత్నం ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. అయితే పాటపై వచ్చిన వివాదం గురించి నాకు తెలియదు. నేను ఆ సమయంలో ఈ సినిమా నేపథ్య సంగీతం పనుల్లో చెన్నైలో బిజీగా ఉన్నాను. ‘సారంగ దరియా’, ‘హే పిల్లా...’, ‘నీ చిత్రం చూసి...’ పాటలకు మంచి వస్తోన్న స్పందన చాలా ఆనందం కలిగించింది. పాటలు విని రెహమాన్‌గారు బావున్నాయని నా స్నేహితులతో అనడంతో చాలా సంతోషించాను. నేపథ్య సంగీతం అందించడం సవాల్‌గా అనిపించింది. ఈ పాటలకు మంచి స్పందన రావడంతో కొత్త అవకాశాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఒకే జానర్‌ అనే ముద్ర పడకుండా అన్ని తరహా పాటలు, సంగీతం అందించాలనే తపనతో ఉన్నా. 


Advertisement
Advertisement