Abn logo
Sep 26 2021 @ 03:17AM

అప్పుల కోసమే సినిమా డబ్బులు

ఆన్‌లైన్‌ టికెట్ల ఆదాయం చూపి రుణాలు

నాపై కోపంతో సినిమాను చంపేస్తున్నారు

ప్రశ్నించడమే ‘రిపబ్లిక్‌’ స్ఫూర్తి

టీడీపీ హయాంలో కాపు కోటా అన్నారు

ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?

కోడికత్తి, వివేకా కేసులు ఏమయ్యాయ్‌?

మోహన్‌బాబు కూడా మాట్లాడాలి

ఇప్పుడు సినిమాలు.. రేపు మీ స్కూళ్లు!

‘రిపబ్లిక్‌’ సినిమా వేడుకలో పవన్‌ విసుర్లు


హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కోట్లు తీసుకుంటారని అంటుంటారు. అరేయ్‌ సన్నాసుల్లారా... దద్దమ్మల్లారా! ఇవి దోచుకున్న డబ్బులు కాదు. కష్టపడితే వచ్చే డబ్బులు. కాంట్రాక్టులతో, అవినీతితో సంపాదించింది కాదు. పన్నులు కూడా కడుతున్నాం.

వైసీపీ వాళ్లు ఏం చేస్తారు? ఆస్థాన విద్వాంసులతో ‘ఈ గంట గడిస్తే చాలు. ఓ అరగంట వస్తే చాలు. పట్టుమని పది నిమిషాలు. చప్పున వస్తా, ఇట్టే చల్లారిపోతా’ వంటి టైటిల్స్‌తో సినిమాలు తీసి... కాకినాడలోని చాణక్య చంద్రగుప్తా మీ ఎమ్మెల్యే హాలులో రిలీజ్‌ చేసుకోండి!

ప్రెసిడెంట్‌ మెడల్‌ కావాలంటే... సాహసం చేయాలి. కానీ... ఏపీలో బ్రాందీ కొట్టుకు వెళితే ప్రెసిడెంట్‌ మెడల్‌... క్వార్టర్‌ బాటిల్‌ దొరుకుతుంది.

సాయి ధరమ్‌ తేజ్‌ అమాయకుడు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కళ్లు తెరవకుండా ఇంకా ఆస్పత్రిలో కోమాలో పడి ఉన్నాడు! సినిమా వాళ్ల గురించి కాదు... రాజకీయ నేరాల గురించి మాట్లాడండి! 


- పవన్‌ కల్యాణ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ పాల్గొన్నారు. ఏపీ సర్కారుపై, వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ సర్కారు వద్ద డబ్బుల్లేవు. సినిమా టికెట్ల డబ్బులు ఖజానాకు వెళితే... ఆ ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తీసుకోవచ్చు. లోన్ల కోసమే సినిమా పరిశ్రమ డబ్బులు వాడుకోవాలని అనుకుంటున్నారు’’ అని విమర్శించారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై చర్చించడం మానేసి... నేర రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు. ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడండి. విశాఖలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో ఒక నాయకుడిపై కోడి కత్తితో దాడి జరిగింది కదా! దీని వెనుక భారీ కుట్ర ఉందని అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా అన్నారు. ఆ కేసు ఏమైందో అడగండి. లక్షలాది ఎకరాల  పోడు భూములు గిరిజనులకు ఎందుకు దక్కడం లేదో... దారి గురించి మాట్లాడండి’’ అని సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు... వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


‘‘రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు? ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని... సినిమా వాళ్లపైనే ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని పవన్‌ ప్రశ్నించారు. ఇడుపులపాయలో నేలమాళిగల్లో టన్నుల కొద్దీ డబ్బులుంటాయని అంటారని... దానిమీద మాట్లాడాలని సూచించారు.


ఆంధ్రాలో సినిమా హాళ్లు ఏవీ?

వైసీపీ ప్రభుత్వం తనపైన కోపంతో మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అడ్డుకుంటోందని పవన్‌ విమర్శించారు. ‘‘నా సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. నా పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారు’’ అని ఆక్రోశించారు. తను హీరోగా ‘వకీల్‌సాబ్‌’ సినిమా నిర్మించిన దిల్‌ రాజును (సభలో ఆయన కూడా ఉన్నారు) ఉద్దేశించి... ‘‘దిల్‌ రాజుగారూ! మీరు నాతో సినిమా తీయకుంటే ఆంధ్రాలో సినిమాలను అడ్డుకునే వారు కాదు. మీరూ రెడ్డి, వారూ రెడ్డే కదా! మీరూ మీరూ తేల్చుకోండి. మమ్మల్ని బతికించండి’’ అని నవ్వుతూ అన్నారు. సినిమా పరిశ్రమకు ఏపీలో జరుగుతున్న అన్యాయంపై పెద్దలంతా మాట్లాడాలని పవన్‌ సూచించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. ‘‘చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన... చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకు?  వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు. వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా? వారి లక్ష కోట్ల ముందు రెండువేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత?’’ అని వ్యాఖ్యానించారు.  ‘రిపబ్లిక్‌’ సినిమా తీయడమే కాదని... ఆ స్ఫూర్తిని కూడా ప్రదర్శించాలని పవన్‌ సూచించారు.


‘‘నేను గొడవ పడటానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. గూండాలు, క్రిమినల్‌ పొలిటీషియన్‌కు భయపడొద్దు. చిరంజీవి అలా ప్రాధేయపడతాడేమిటని అందరూ అంటారు. ఆయనది మంచి మనసు. అలా ప్రాధేయపడాల్సిన అవసరంలేదు. అందరూ ధైర్యంగా ప్రశ్నించాలి. గట్టిగా మాట్లాడాలి. సున్నితంగా ఉంటే ఎలా? ఇది మన హక్కు’’ అని పవన్‌ ఉద్ఘాటించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు కూడా ఏపీలో సినీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలన్నారు. ‘‘మీరు బంధువులు కదా! చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి. ఇప్పుడు సినిమాలకు పెట్టిన నిబంధనలు రేపు మీ విద్యా నికేతన్‌ సంస్థలకూ వర్తింపచేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుంది’’ అన్నారు. తెలుగు సినిమా పట్ల ఏపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే... మారేలా ఎలా చేయాలో తనకు తెలుసునన్నారు.