పూర్తి వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-06-02T09:43:25+05:30 IST

కోవిడ్‌ 19 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలలో విధించిన 50శాతం కోత,

పూర్తి వేతనాలు చెల్లించాలి

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన ప్రదర్శన


సుభాష్‌నగర్‌, జూన్‌ 1: కోవిడ్‌ 19 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలలో విధించిన 50శాతం కోత, మినహాయింపును నిలిపివేసి తక్షణమే పూర్తి వేతనాలు చెల్లించాలని ఐక్యవేదిక రాష్ట్రస్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం వేతన కోతలను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం తీవ్ర గర్హనీయమన్నారు.


పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అని చూడకుండా తొలుత 50 శాతం, మరో నెల 25 శాతం కోత విధించడం అమాననీయమన్నారు. ఇప్పుడు అన్ని ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్న క్రమంలో ప్రభుత్వానికి పూర్తి రెవెన్యూ వస్తున్న సందర్భంలో కూడా మే నెల వేతనం పూర్తిగా చెల్లించకపోవడం విచారకరమన్నారు. సీఎం హమీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినా పీఆర్సీ, ఐఆర్‌ లేదన్నారు. రెండు విడతల డీఏ కూడా లేదన్నారు. మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయవ్యతిరేక వైఖరి అవలంభిస్తుండడం బాధాకరమని వాపోయారు. తక్షణమే పూర్తి వేతనాలు, వేతన మినహాయింపు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐక్య వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్‌ సుభాష్‌, కరివేద మహిపాల్‌రెడ్డి ప్రసంగించారు.


ఈ నిరసన ప్రదర్శనలో డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, యుటీఎఫ్‌రాష్ట్ర కార్యదర్శి జి అశోక్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా రవీంద్రాచారి, ఎన్‌రాములు, వి రాజిరెడ్డి, చంద్రమౌళి, తుమ్మ శ్రీనివాస్‌, బి పర్శరాములు, తూముల తిరుపతి, శనిగరపు రవి, కుమారస్వామి, రాంచంద్రారెడ్డి, ఎ శ్రీనివాస్‌రెడ్డి, మీసాల మల్లిక్‌, కె నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:43:25+05:30 IST