మామిడి, ట మాట మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2021-05-08T08:54:21+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో మామిడి, టమాట మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు

మామిడి, ట మాట మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి

అధికారులతో సమీక్షలో కన్నబాబు 


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నేపథ్యంలో మామిడి, టమాట మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మామిడి, టమాట ధరలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా నున్న తదితర మార్కెట్లకు రైతులు రాత్రులు కూడా సరుకులు తీసుకురావొచ్చన్నారు. మామిడి ధరలను ప్రతిరోజు పర్యవేక్షించాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్ల ధరల విషయంలో రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యూనిట్లు ఇచ్చే ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. అదేవిధంగా టమాట ధరలు పడిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2000 వేల టన్నుల టమాటలను ప్రాసెసింగ్‌ యూనిట్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  అవసరమైన మేరకు రైతు బజార్ల వికేంద్రీకరణ, మొబైల్‌ రైతు బజార్ల ఏర్పాటుకు  నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ అధికారులతో సంప్రదించాలని, స్థానిక అధికారులకు మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయాధికారం ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులకు పాసులు మంజూరు చేయాలని మంత్రి సూచించారు.

Updated Date - 2021-05-08T08:54:21+05:30 IST