ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ కాల్ కట్ చేసి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2021-09-16T06:02:48+05:30 IST

వైసీపీ అధిష్ఠానంపై..

ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ కాల్ కట్ చేసి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే!
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

వైసీపీ ఎమ్మెల్యే అలక

మంత్రి పదవి ఆశిస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించిన ప్రభుత్వం

విజయసాయి ఫోన్‌... సున్నితంగా తిరస్కరణ

దళితుడ్ని కాబట్టి అవమానిస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన

ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి....


విశాఖపట్నం/పాయకరావుపేట/నక్కపల్లి(ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వైసీపీ అధిష్ఠానంపై అలకబూనారు. మంత్రి పదవి ఆశిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమించడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. విషయం తెలిసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనకు ఫోన్‌ చేశారు. ‘నాకు టీటీడీ పదవి అవసరంలేదు’ అంటూ ఫోన్‌ కాల్‌ కట్‌ చేయడమే కాకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరు కూడా వుంది. అయితే రెండేళ్ల కిందట టీటీడీ బోర్డును నియమించినప్పుడు సభ్యునిగా బాబూరావు పేరు వినిపించింది. ఏ కారణం చేతనోగానీ ఆయనకు బదులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఎంపిక చేశారు. అప్పట్లో నిరాశ చెందిన ఆయనకు ఈ పర్యాయం అధిష్ఠానం అవకాశం కల్పించి టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. కాగా సీఎంగా జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు... రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రులందరినీ మార్చుతానని ప్రకటించడం, త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వుంటుందని ఊహాగానాలు వెలువడుతుండడంతో గొల్ల బాబురావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.


ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం అంటే మంత్రి పదవి లేదని పరోక్షంగా చెప్పినట్టేనని భావించిన ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఏంపీ విజయసాయిరెడ్డి స్వయంగా బాబూరావుకు ఫోన్‌ చేయగా... ‘‘నాకు టీటీడీ పదవి అవసరం లేదు’’ అని ఫోన్‌ కట్‌ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి, జగన్‌ వెంట నడిచిన అతికొద్దిమందిలో తాను ఒకడినని, దళితుడిని కాబట్టే తనను చిన్నచూపు చూస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అప్పట్లో జగన్మోహన్‌రెడ్డిని తీవ్రదుర్భాషలాడిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవులు కట్టబెట్టారని, తనను మాత్రం పక్కన పెట్టారని వాపోయినట్టు తెలిసింది. 

Updated Date - 2021-09-16T06:02:48+05:30 IST