గూగుల్‌పే చేశామంటూ ఉంగరంతో ఉడాయించిన నిందితులు

ABN , First Publish Date - 2021-01-22T15:56:09+05:30 IST

ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశామని చెప్పి ఇద్దరు వ్యక్తులు బంగారు ఉంగరంతో ఉడాయించిన సంఘటన మీర్‌చౌక్‌ పోలీస్టేషన్‌ పరిధిలో...

గూగుల్‌పే చేశామంటూ ఉంగరంతో ఉడాయించిన నిందితులు

హైదరాబాద్/చార్మినార్‌(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశామని చెప్పి ఇద్దరు వ్యక్తులు బంగారు ఉంగరంతో ఉడాయించిన సంఘటన మీర్‌చౌక్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. గుల్జార్‌హౌస్‌ సమీపంలో ట్వింకిల్‌ సోని దుర్గా జువెల్లరీ పేరుతో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళలు ధరించే రింగ్‌ను చూపమని కోరారు. ట్వింకిల్‌ సోని చూపిన ఉంగరాల్లో 4.66 గ్రాముల ఉంగరాన్ని ఎంపిక చేసుకున్నారు. అనంతరం ఉంగరం ఖరీదు రూ. 23,800లను గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లించామని వారు తెలపడంతో ట్వింకిల్‌ తన ఫోన్‌లో చెల్లింపుల వివరాలను చూసుకోవడం ప్రారంభించాడు. ఈ సమయంలో వారిద్దరు ఉంగరం తీసుకొని ఉడాయించారు. గూగుల్‌పేలో డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు షాపులోని కెమెరాలు, సమీపంలో ఉన్న కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మీర్‌చౌక్‌ క్రైం ఎస్‌ఐ జబ్బార్‌ తెలిపారు.

Updated Date - 2021-01-22T15:56:09+05:30 IST