పేటీఎం ఇన్వెస్టర్లకు భారీ షాక్.. అడుగుపెట్టిన తొలి రోజే భారీ పతనం

ABN , First Publish Date - 2021-11-18T23:41:39+05:30 IST

డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తొలి రోజే భారీ షాక్ తగిలింది. దేశంలోనే అతిపెద్ద

పేటీఎం ఇన్వెస్టర్లకు భారీ షాక్.. అడుగుపెట్టిన తొలి రోజే భారీ పతనం

ముంబై: డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తొలి రోజే భారీ షాక్ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నేడు మార్కెట్లో అడుగుపెట్టిన పేటీఎం షేర్లు లిస్టయిన తొలి రోజే నష్టాలు మూటగట్టుకున్నాయి.


పేటీఎం మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్ ఒక్కో షేర్ ఇష్యూ ధరను రూ. 2,150గా నిర్ణయించగా తొలి రోజు అందరినీ షాక్‌కు గురిచేస్తూ 9.3 శాతం తక్కువగా అంటే రూ. 200 నష్టంతో రూ. 1,950కి షేర్లు లిస్ట్ అయ్యాయి. మదుపరుల నుంచి తగినంత స్పందన లేకపోవడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో పేటీఎం షేర్ ధర 25శాతం నష్టపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో షేర్ విలువ రూ. 1,586కు పడిపోయి అత్యంత కనిష్టానికి తగ్గింది. అయితే, తొలి రోజు షేర్లు బాగా నష్టపోయినప్పటికీ సంస్థ మార్కెట్ విలువ మాత్రం లక్ష కోట్ల మార్కును టచ్ చేయడం గమనార్హం.


మార్కెట్‌లో పేటీఎంకు తొలి రోజే నష్టాలు రావడంపై మార్కెట్ నిపుణులు స్పందించారు. షేర్ ఇష్యూ ధర ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. లాభాలను ఆర్జించడం ఇప్పుడు పేటీఎంకు సవాలేనని అంటున్నారు. మరికొన్నాళ్లపాటు పేటీఎంకు నష్టాలు తప్పవని, కాబట్టి ఈ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు బయటపడితే మంచిదని సూచిస్తున్నారు. 


పేటీఎం మొత్తం రూ. 18,300 కోట్ల విలువైన షేర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో రూ. 8,300 కోట్ల విలువైన కొత్త షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తుండగా, మిగతా రూ. 10 వేల కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద వ్యవస్థాపకుడు విజయశేఖర శర్మ, యాంట్ ఫైనాన్షియల్, అలీబాబా, ఎలెవేషన్ కేపిటల్, సైఫ్ పార్ట్‌నర్స్ సహా ఇప్పటికే షేర్ హోల్డర్ల వద్ద ఉన్న వాటిని ఐపీవోలో పెట్టింది. అలాగే, 100 మంది సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ.8,235 కోట్ల విలువైన షేర్లను సంస్థ కేటాయించింది.  

Updated Date - 2021-11-18T23:41:39+05:30 IST