కోవిడ్-19 నివారణ కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-27T01:43:55+05:30 IST

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ పలు దేశాల్లో ఆదేశాలు జారీ

కోవిడ్-19 నివారణ కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

కరాచీ: కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ పలు దేశాల్లో ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ వ్యాప్తంగా 21వ రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ పాకిస్థాన్‌ను సైతం వణికిస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ దాదాపు వెయ్యి మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోంది. 


ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కాంట్రాక్ట్ ప్లేయర్లు ప్రభుత్వ సహాయ నిధికి తమ వొంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పీసీబీ క్రికెటర్ల అంతా కలిసి ప్రభుత్వ సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ఇషాన్ మనీ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ సహాయనిధికి ఐదు లక్షలు అందిస్తాము. ఇందుకోసం సాధారణ అధికారులు తన ఒక రోజు జీతం, ఉన్నతాధికారులు, సీనియర్ మేనేజర్లు తమ రెండు రోజుల జీతాలు విరాళంగా ఇస్తారు’’ అని ఇషాన్ మనీ పేర్కొన్నారు. 


‘‘పీసీబీ ఈ నిధులన్ని సేకరించి ప్రభుత్వ సహాయనిధిలో జమ చేస్తుంది. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత క్రికెట్ బోర్డు మీద ఉంది’’ అని ఆయన తెలిపారు. 


అంతేకాక.. కోవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు కరాచీ జాతీయ స్టేడియంను పూర్తిస్థాయిగా ప్యారా మెడిక్‌ సిబ్బందికి అప్పగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందులో ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇటీవలే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాదాపు 2వేల మంది కుటుంబాలకు రేషన్, నిత్యావసర వస్తువులు అందించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-27T01:43:55+05:30 IST