మందుల్నీ మింగేస్తున్నారు

ABN , First Publish Date - 2020-08-02T14:54:05+05:30 IST

బ్రాండెడ్, జనరిక్ మందులు తెలుసు. పీసీడీ..

మందుల్నీ మింగేస్తున్నారు

పీసీడీ మందులతో మంత్రి అనుచరుడి దందా

విటమిన్ ట్యాబ్లెట్లు, జ్వరం బిళ్లలపై కన్ను

ప్రైవేట్ ఆసుపత్రులు, మందుల దుకాణాలపై ఒత్తిడి

తాను ఇచ్చే మందులే వాడాలని బెదిరింపులు

నాణ్యతపై ఎన్నో సందేహాలు

రూ. కోట్లలో అక్రమార్జన


విజయవాడ, ఆంధ్రజ్యోతి: బ్రాండెడ్, జనరిక్ మందులు తెలుసు. పీసీడీ (ప్రాపగాండ కమ్ డిస్ట్రిబ్యూషన్) మందుల గురించి తెలుసా..? ప్రజల అవసరాలు.. భయాలే లక్ష్యంగా మంత్రి అనుచరుడు నడిపిస్తున్న దందాలో ఈ పీసీడీ ఓ భాగం. కోట్ల రూపాయల అక్రమార్జనలో ఈ మందులే వారికి పెట్టుబడి. అసలు ఏమిటా పీసీడీ కథ అంటే..


కరోనా నేపథ్యంలో ప్రజలు విటమిన్‌ సి, డి, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతోపాటు జ్వరం, ఒళ్లునొప్పులకు వాడే డోలో వంటి మందుబిళ్లలకూ డిమాండ్‌ పెరిగింది. ఇదే రంగంలో ఉన్న మంత్రి అనుచరుడి దృష్టి వీటిపై పడింది. ఎలాగైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మందు బిళ్లల దందాకు తెరతీశారు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, మందుల దుకాణాల వారిని సమావేశపరిచి తాను ఇచ్చే పీసీడీ మందులే కొనాలని బెదిరింపులకు దిగాడు.


ఈ పీసీడీ మందుల నాణ్యతపై వారు సందేహం వ్యక్తం చేయగా, తాను చెప్పినట్టు వినకుంటే ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో దాడులు చేయిస్తానని బెదిరించినట్లు సమాచారం. ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న మల్టీ విటమిన్‌, జ్వరం, ఒళ్లునొప్పి మందు బిళ్లలను పీసీడీ మందులుగా తయారు చేయించి సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ పీసీడీ మందుల దందా ద్వారా నెలకు సుమారు రూ.50కోట్ల మేర ఆర్జిస్తున్నట్లు సమాచారం. ప్రజల ప్రాణాలతో ఇంతలా చెలగాటమాడుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. 


పీసీడీ అంటే..

పెద్దపెద్ద ఫార్మా కంపెనీలు తయారుచేసే మందులను బ్రాండెడ్‌ మందులుగా పేర్కొంటాం. ఇవి తయారు చేయడానికి పరిశోధనలపై బోల్డెంత ఖర్చు పెడతారు. కాబట్టి ఎక్కువ ధర ఉంటాయి. ఫార్మా కంపెనీ తయారుచేసిన మందుకు పేటెంట్‌ హక్కుల గడువు ముగిశాక ఆ మందు ఫార్ములాతో తెలిసిన ఇతర కంపెనీలు ఏవైనా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తయారయ్యేవే జనరిక్‌ మందులు. కొన్నిసార్లు పెద్దపెద్ద కంపెనీలు కూడా మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు తాము గతంలో బ్రాండెడ్‌గా అమ్మిన మందులనే పేటెంట్‌ గడువు ముగిశాక బ్రాండెడ్‌తో పాటు జనరిక్‌ మందులుగా తీసుకొస్తుంటాయి.


ఈ రెండు కాకుండా పీసీడీ మందులు ఉంటాయి. ఫలానా మందు మాకు తయారుచేసి ఇవ్వండి, దానికి పేరు పెట్టుకుని, అమ్ముకుంటామని ఓ ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఈ పీసీడీ మందుల తయారీ మొదలవుతుంది. ఉదాహరణకు ఓ ఫార్మా కంపెనీ డోలో పేరుతో ఓ మందు బిళ్లను తయారు చేసిందనుకుంటే.. అదే ఫార్ములాతో కేవలం ట్యాబ్లెట్లను తయారుచేసి ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం అన్నమాట. వీటిలో భారీ ఎత్తున మార్జిన్‌ ఉంటుంది. తయారు చేయించుకునే వ్యక్తి, తయారుచేసే వారిపైనే  నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ పీసీడీ మందుల ద్వారానే జనాలను దోచుకునేందుకు మంత్రి అనుచరుడు తెరతీశారు. 


అడ్డగోలు ధరలతో దోపిడీ

కరోనా కాలంలో పీపీఈ కిట్లకు, గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని కూడా మంత్రి అనుచరుడు తనకు అనుకూలంగా మలచుకున్నారు. సర్జికల్‌ షాపుల వారి నుంచి కమీషన్లు తీసుకుని మీరు మీ ఇష్టమొచ్చిన ధరకు విక్రయించుకోండి. నేను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో దుకాణాల వారు రెచ్చిపోయి అడ్డగోలు విక్రయాలకు తెరతీశారు. ఒక దశలో గ్లోవ్స్‌ రూ.100 రకం రూ.600 వరకు విక్రయించారు. ఎన్‌-95 మాస్కులను రూ.300 వరకు విక్రయించారు. ఇవి హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.32 నుంచి రూ.50కే వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పల్స్‌ ఆక్సీమీటర్లకు డిమాండ్‌ ఉంది. దీన్ని నగరంలోని సర్జికల్‌ షాపులు, మందుల షాపుల వారు సొమ్ము చేసుకుంటున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న పల్స్‌ ఆక్సీమీటర్లను రూ.1,000.. ఆపైన విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటి ధర రూ.200 కూడా ఉండదు. పైగా చైనా వస్తువుల నాణ్యత కూడా అంతంతే. అధికశాతం చైనా పల్స్‌ ఆక్సీమీటర్లు తప్పుడు రీడింగ్‌లు చూపిస్తుంటాయి. 


మంత్రి అండతో..

వన్‌టౌన్‌లోని ఓ సర్జికల్‌ దుకాణంపై ఏప్రిల్‌లో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేశారు. మాస్కులు, శానిటైజర్లను ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారన్నది ఆరోపణ. శానిటైజర్లను ఏకంగా ఇంట్లోనే తయారుచేసి 100 ఎంఎల్‌ రూ.150కు విక్రయించేవారు. దీనిపై పక్కా సమాచారంతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేశారు. షాపును సీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో మంత్రి అనుచరుడు రంగప్రవేశం చేశారు. మంత్రితో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి కేసు లేకుండా చేశారు. ఈ మొత్తం డీల్‌కు నజరానాగా భారీ మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. 


Updated Date - 2020-08-02T14:54:05+05:30 IST