సీరియల్‌ కిల్లర్‌ మైనం రాములుపై పీడీయాక్టు

ABN , First Publish Date - 2021-06-04T13:53:28+05:30 IST

2003 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 17 మంది మహిళలను చంపిన

సీరియల్‌ కిల్లర్‌ మైనం రాములుపై పీడీయాక్టు

హైదరాబాద్‌ సిటీ : 2003 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 17 మంది మహిళలను చంపిన సీరియల్‌ కిల్లర్‌ మైనం రాములు అలియాస్‌ బొట్టురాములు అలియాస్‌ రవి అలియాస్‌ తలారి సాయిలుపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీయాక్టు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన మైనం రాములుకు తల్లిదండ్రులు 21 ఏళ్లకు వివాహం చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకు భార్య అతన్ని వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దాంతో అప్పటినుంచి రాములు మహిళలపై కక్షపెంచుకున్నాడు. 


మహిళలను లోబర్చుకొని చంపేయాలని నిర్ణయించుకుని కల్లు దుకాణాలకు వచ్చే వారిని టార్గెట్‌ చేసుకున్నాడు. వారితో కలిసి కల్లు తాగి మాయమాటలతో లోబర్చుకునేవాడు. డబ్బుల ఆశచూపించి వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి మత్తులోఉండగానే హతమార్చేవాడు. పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా చేసి పారిపోయేవాడు. ఇలా 2003 నుంచి ఇప్పటి వరకు 17మంది మహిళలను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇటీవల ఘట్‌కేసర్‌ పరిధిలో ఓ మహిళను హత్య చేసిన ఘటనలో రాచకొండ పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారించిన క్రమంలో మొత్తం 17మంది మహిళలను చంపిన విషయం అతను ఒప్పుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరమని భావించిన సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుడిపై పీడీయాక్టు నమోదు చేశారు. 

Updated Date - 2021-06-04T13:53:28+05:30 IST