‘శాంతి’ సందేశం

ABN , First Publish Date - 2021-10-15T08:01:06+05:30 IST

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది ఇద్దరు పాత్రికేయులకు ప్రదానం చేయాలన్న నార్వే కమిటీ నిర్ణయంతో జర్నలిజానికి మరింత గౌరవం లభించింది...

‘శాంతి’ సందేశం

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది ఇద్దరు పాత్రికేయులకు ప్రదానం చేయాలన్న నార్వే కమిటీ నిర్ణయంతో జర్నలిజానికి మరింత గౌరవం లభించింది. ఈ పురస్కారాన్ని పొందిన ఫిలిప్పీన్స్‌ జర్నలిస్టు మరియా రెస్సా, రష్యా పాత్రికేయుడు దిమిత్రీ మురతోవ్‌లు నిజానికి చాలా దేశాల్లో కఠినమైన ప్రతికూల వాతావరణంలోనూ వృత్తిధర్మానికి కట్టుబడిన పాత్రికేయులకు ప్రతినిధులు. భావప్రకటనాస్వేచ్ఛకు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం పొంచివుందనీ, దానిని పరిరక్షించేందుకు ఈ ఇద్దరూ పడుతున్న శ్రమ అభినందనీయమని నోబెల్‌ కమిటీ ప్రశంసించింది. జర్నలిస్టుకు నోబెల్‌శాంతి బహుమతి లభించడం 1935 తరువాత మళ్ళీ ఇప్పుడే కాబట్టి, వీరిద్దరికీ దక్కిన ఈ గౌరవం కచ్చితంగా పాత్రికేయరంగంలో ఉన్నవారికి ఎంతో ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ ఇస్తుంది. 


ఫిలిప్పీన్స్‌, రష్యాలకు చెందిన పాత్రికేయులను నోబెల్‌ కమిటీ ఎంచుకోవడం వెనుక ఏవో దురుద్దేశాలున్నాయన్న విమర్శ లేకపోలేదు కానీ, ఫిలిప్పీన్స్‌ పాలకుడు రోడ్రిగో డ్యుటెర్టే వివాదస్పద పాలనా విధానం ప్రపంచానికి తెలిసిందే. ఆయన నిరంకుశ వైఖరి, నేరాలూ ఘోరాలను నియంత్రించడం పేరిట ఆయన జరిపే ఊచకోతలూ చూసినవే. ముప్పైఐదుసంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న మరియా రెస్సా సీఎన్‌ఎన్‌తో ఉన్న సుదీర్ఘ బంధాన్ని వదులుకొని పోరాటమే లక్ష్యంగా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం వెబ్‌సైట్‌ రాప్లర్‌ను ఆరంభించింది. కేసులూ అరెస్టులూ జైళ్ళూ బెయిళ్ళూ మధ్య చక్రంలా తిరుగుతూ పాలకుల నిరంశకుత్వాన్నీ, అధికార దుర్వినియోగాన్నీ దునుమాడారు. డ్యుటెర్టే నోటిదురుసు, ఉన్మాదం, హింసాత్మక ధోరణులకు ఏమాత్రం వెరవకుండా ఆయన రాజ్యాంగేతర నిర్ణయాలూ విధానాలపై శక్తిమేరకు పోరాడింది. తనపై నమోదవుతున్న కేసులు హెచ్చుతున్నా, పదేపదే జైలుకు పోవాల్సివచ్చినా రాజ్యాంగహక్కుల రక్షణకు, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు ఆమె కట్టుబడే ఉన్నారు. పాలకులు, వారి తొత్తులూ, కార్పొరేట్లు ప్రచారంలో పెట్టే ఫేక్‌న్యూస్‌పై ఆమె పోరాటం చక్కనిది. రష్యా పాలకుడు వ్లాదిమిర్‌ పుతిన్‌మీద ఎంతోకాలంగా దాదాపు ప్రత్యక్షయుద్ధమే చేస్తున్న మురతోవ్‌కు ఈ అవార్డు లభించడం క్రెమ్లిన్‌కు అమ్ముడుపోతున్న లేదా దానికి వొణికిపోతున్నవారికి చెంపపెట్టు. పాతిక సంవత్సరాలుగా నోవాయా గెజిటా సంపాదకుడిగా ఉన్న మురతోవ్‌ పాత్రికేయ ప్రమాణాలకు, విలువలకు కట్టుబడిన తన తోటివారిని ప్రోత్సహించాడు, నిర్భయమైన కథనాలతో పాలకులను వొణికించాడు. చెచెన్యా అకృత్యాలను, పాలకుల అక్రమాలను వెలుగులోకి తెస్తూ ఆ పోరాటంలో అరడజనుమంది విలేకరులను కోల్పోయాడు. 


ఫిలిప్పీన్స్‌లోనూ, రష్యాలోనూ మీడియా ఎటువంటి ఉక్కబోత వాతావరణం ఎదుర్కొంటున్నదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. పాత్రికేయుల హత్యలు వేధింపులు శిక్షల సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువ. అనేకదేశాల్లో కాస్త అటూఇటూగానైనా ఇదే వాతావరణం ఉన్నది. 180దేశాల మీడియాస్వేచ్ఛ సూచీలో ఫిలిప్పీన్స్‌ 138వ ర్యాంకులో ఉంటే భారతదేశం మరో నాలుగుమెట్లు దిగువనే ఉంది. పొరుగున ఉన్న చిన్నాచితకా దేశాలు మనకంటే నయం. 


గత పదేళ్ళలో 155మంది పాత్రికేయులను నిర్బంధించడమో, అరెస్టు చేయడమో జరిగితే వాటిలో నలభైశాతం గత ఏడాదివి మాత్రమే. చివరకు దేశద్రోహం కేసులతో కూడా పాత్రికేయులను భయపెడుతున్న దుర్మార్గమైన వాతావరణంలో ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఏలికలను ఆపవలసి వచ్చింది. పాత్రికేయులపై దాడులు, అరెస్టులే కాదు, గౌరీ లంకేష్‌ వంటివారి హత్యలు కూడా భారత్‌లో పత్రికాస్వేచ్ఛ ఏ పాటిదో చెబుతాయి. నిరంకుశ ప్రభుత్వాలు, అవినీతిపరులైన నాయకులు, కార్పొరేట్‌ సంస్థల ధనదాహం మధ్య సత్యం సమాధికాకుండా నిలబెట్టడం సులభమేమీ కాదు. భయంతోకానీ, భక్తితో కానీ నోరువిప్పలేని పాత్రికేయులు, మీడియా సంస్థలకు ఈ నోబెల్‌ శాంతి బహుమతి వృత్తిధర్మానికి కట్టుబడమంటూ ఓ విలువైన సందేశాన్ని ఇస్తున్నది. ఎన్ని కష్టాలు ఎదురైనా, నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజలపక్షాన ఉండమనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమనీ కర్తవ్య బోధ చేస్తున్నది.

Updated Date - 2021-10-15T08:01:06+05:30 IST