Abn logo
Sep 25 2021 @ 00:21AM

ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నికలు

బిక్కవోలు ఎంపీపీ జ్యోతిర్మయిని అభినందిస్తున్న ఎమ్మెల్యే దంపతులు

కడియం/బిక్కవోలు సెప్టెంబరు 24: జిల్లాలో పలు మండలాల్లో పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల అధికారులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలతో ప్రమాణస్వీకారం చేయించారు. 

కడియం ఎంపీపీగా వెలుగుబంటి ప్రసాద్‌

కడియం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్య క్రమంలో ముందుగా కో-ఆ ప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరిగింది. మాధవరాయుడుపాలేనికి చెందిన షేక్‌ వలీశ్రీనివాస్‌ను మెజారిటీ సభ్యులు ఎన్నుకున్నారు. తర్వాత ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎం పీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలను రిటర్నింగ్‌ అధికారి విశ్వనాథ్‌చౌదరి, ఎం పీడీవో ఈ.మహేష్‌, ఏవో కె. చంద్రరావు, ఈవోపీఆర్‌డీ వైవీ ఎన్‌ఎస్‌ లక్ష్మి నిర్వహించారు. ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీకి చెందిన గిరజాల బాబుకు 9మంది ఎంపీటీసీలు మద్దతు తెలపగా టీడీపీ అభ్యర్థి వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్‌కు 12 మంది మద్దతు తెలిపారు. దీంతో ప్రసాద్‌ను ఎంపీపీగా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. అలాగే ఉపాధ్యక్షుడిగా కడియపులంక-5 నుంచి జనసేన తరుపున విజయం సాధించిన పంతం గణపతి ఎన్నికయ్యారు. బలపరీక్షలో మెజారిటీ సభ్యులు గణపతికి చేతులెత్తి మద్దతు తెలపడంతో గణపతిని ఆర్వో వైస్‌ ఎంపీపీగా ప్రకటించారు. ఎంపీపీగా ఎన్నికైన పసాద్‌ను పెద్దఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు అభినందించారు. ఎంఆర్‌ పాలెం సర్పంచ్‌ అన్నం దేవుల చంటి భారీ గజమాల వేసి అభిమానాన్ని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్గాని లక్ష్మీసత్యనారాయణ, కడియపులంక మాజీ సర్పంచ్‌ గట్టి నర్సయ్య, టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రామారావుచౌదరి పాల్గొన్నారు. కాగా ఎంపీపీ ఎన్నిక సందర్భంగా సౌత్‌జోన్‌ అడిషనల్‌ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, పలువురు ఎస్‌ఐలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.