తెగుళ్లతో శనగ రైతు కుదేలు

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

తెగుళ్ల ఉధృతితో కొరిశపాడు మండలంలో శనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తెగుళ్లతో శనగ రైతు కుదేలు
దైవాలరావూరులో ఆకుమచ్చ తెగులుతో ఎండిపోయిన శనగ పంట

ఎండిపోతున్న చేలను చూసి దిగాలు

ఎకరానికి రూ.30 వేలకుపైనే ఖర్చు

మేదరమెట్ల, జనవరి 24: తెగుళ్ల ఉధృతితో  కొరిశపాడు మండలంలో శనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు భాగా పడ్డాయి, పంటలు భాగా పండుతాయని ఆశపడిన రైతులకు ఆకాల వర్షాల వల్ల వచ్చిన తెగుళ్లతో ఆశలు అడియాశలు అ య్యాయి. ఈ సంవత్సరం ఏజీ 11 కాక్‌ 2 రకం శనగను మండలంలోని 6 వేల ఎకరాలల్లో రైతులు సాగు చేశారు. అధిక వర్షాలతో పలు మార్లు వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాక్‌ 2 రకం వేసిన రైతులకు పంటంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో వేరుకుళ్లు తెగులుతో ఎండిపోతోంది. మరో పక్క ఆకుమచ్చ తెగులు సోకి ఆకులు ఎర్రబడి శనగ పంట రెండు రోజుల్లోనే తిరగబడి పోయింది. కొన్ని శనగ చేలు బూజు పట్టినట్లుగా తెల్లగా   పోయాయి. 

నవంబరు 10వ తేదీ ప్రాంతంలో వేసిన ఏజీ 11 రకం శనగ పూత, పిందె దశకు వచ్చే సరికే ఒక్కసారిగా మారిపోయింది. పంట పీకే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేతలు దెబ్బతిన్న శనగ పంటను పరిశీలించినప్పటికి సరైన కారణం చెప్పలేకపోయారు. ఎకరానికి రూ.30 వేలకు పైగా ఖర్చు చేసిన శనగ రైతులు బావురుమంటున్నారు. మండలంలోని ఎక్కువ గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 

ఆరు ఎకరాల్లో పంటంతా పోయింది

-దేసు పుల్లరావు. రైతు

నేను సాగు చేసిన శనగ పంట తెగుళ్లతో పూరిగా దెబ్బతిని పోయిం ది. ఆరు ఎకరాలల్లో  వేస్తే ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు, వ్యవసాయం, పురుగుమందులు, కలుపు మందులు, అన్ని కలిపి ఎకరానికి రూ. 30 వేలకు పైగా ఖర్చు అయింది. ఈ పరిస్థితుల్లో  ప్రభుత్వమే ఆదుకోవాలి. 

Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST