ప్రత్యేక పిల్లల ఆసుపత్రి మనకే..!

ABN , First Publish Date - 2021-06-14T05:18:28+05:30 IST

ప్రత్యేక పిల్లల ఆసుపత్రి మనకే..!

ప్రత్యేక పిల్లల ఆసుపత్రి  మనకే..!
సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ

సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ స్థలమే అనువైన ప్రదేశం

దాదాపు ఖరారు చేసిన ఉన్నతాధికారులు 

ప్రభుత్వ పెద్దల నుంచి సూత్రప్రాయ అంగీకారం 

వీలైనంత త్వరలో నిర్మాణ పనులు 

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ 

ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ప్రత్యేక పిల్లల ఆసుపత్రి విజయవాడకే దక్కింది. నిన్నటివరకు గుంటూరా, విజయవాడా అనే మీమాంసలో ఉన్న అధికారులు అనేక పరిశీలనల అనంతరం నగరంలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ ఆవరణలోనే నిర్మించడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : రూ.180 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రత్యేక పిల్లల ఆసుపత్రి చివరికి విజయవాడకే దక్కింది. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా, అదే కాలేజీ ఆవరణలో అత్యుత్తమ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటరుగా చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దల నుంచి సూత్రప్రాయంగా అంగీకారం లభించింది.

పలు పరిశీలనల అనంతరం

కరోనా మూడో దశ ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపైనే ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మూడు ప్రత్యేక పిల్లల ఆసుపత్రులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి విశాఖపట్నంలోనూ, మరొకటి తిరుపతిలోనూ, మూడోది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించడంతో ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ పిల్లల ఆసుపత్రిని నిర్మించాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రెండుచోట్లా అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించారు. గుంటూరులోని అరండల్‌పేట సమీపంలో ఉన్న బొంగరాలగూడెంలో ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని చెప్పడంతో రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రాఘవేంద్రరావు పరిశీలించి వచ్చారు. ఆ తర్వాత విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి చెందిన స్థలాన్ని చూశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలాన్ని పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజల రాకపోకలకు అనువుగా లేని మారుమూల ప్రదేశంలో రూ.180 కోట్లతో ఆసుపత్రిని నిర్మించే కంటే, అందరికీ బాగా తెలిసిన ల్యాండ్‌మార్క్‌ విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావించారు. ఎస్‌ఎంసీ ఆవరణలో కావాల్సినంత స్థలం ఉన్నందున అక్కడే ఆసుపత్రిని నిర్మించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలిసింది. 

అనేక ప్రయోజనాలు

ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పిల్లల ఆసుపత్రిని విజయవాడలో నిర్మిస్తే భవిష్యత్తులో హైదరాబాదులోని నీలోఫర్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని, దానివల్ల ఎస్‌ఎంసీలో పీడియాట్రిక్‌ విభాగానికి చెందిన అన్ని రకాల మెడికల్‌ సీట్లు పెరుగుతాయని, పిల్లలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. అలాగే, పొరుగున ఉన్న గుంటూరు, ఖమ్మం, గోదావరి జిల్లాల ప్రజలకు, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల ప్రజలకు చేకూరే ప్రయోజనాల గురించి వివరిస్తూ ఈనెల 11న ‘బెజవాడే బెస్ట్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ దిశగా ప్రభుత్వ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించడంతో వీలైనంత త్వరలోనే ఎస్‌ఎంసీ ఆవరణలో ప్రత్యేక చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 




Updated Date - 2021-06-14T05:18:28+05:30 IST