Abn logo
Jul 23 2021 @ 01:58AM

పార్లమెంటులో పెగాసస్‌ సెగలు

  • రాజ్యసభలో ప్రతిపక్షాల రభస
  • కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతిలో 
  • కాగితాలు లాక్కొని చించేసిన టీఎంసీ ఎంపీ
  • పెగాసస్‌పై ప్రకటనను అడ్డుకున్న సభ్యులు
  • లోక్‌సభలోనూ తీవ్ర గందరగోళం
  • ఉభయసభలు పలుమార్లు వాయిదా
  • మా ఫోన్లపైనా నిఘా: రైతు సంఘాలు
  • చర్చలకు రండి: కేంద్ర మంత్రి తోమర్‌
  • పెగాసస్‌ నిఘాను ఖండించిన చైనా!


న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ సెగలు చల్లారడం లేదు. పార్లమెంటులో ప్రకంపనలు ఆగలేదు. పెగాసస్‌ నిఘా కుంభకోణం, ఇంధన ధరల పెంపు, రైతుల సమస్యలపై గురువారం కూడా ఉభయసభలు స్తంభించిపోయాయి. ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించడంతో రోజంతా పెద్దగా కార్యకలాపాలు జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్‌ పెగాసస్‌ స్పైవేర్‌పై ప్రకటనను చదివి వినిపిస్తుంటే సభ్యులు అడ్డుకున్నారు. టీఎంసీ సభ్యుడు శంతను సేన్‌ మంత్రి చేతిలో నుంచి పత్రాలను లాక్కొని చింపి గాల్లోకి విసిరేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రవర్తన సరికాదని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ చెప్పారు. ఏదైనా అంశంపై చర్చకు ఇష్టం లేకపోతే ఆందోళన తెలపాలి తప్ప ఇలా చేయడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు.


ఇక లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వెంటనే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తొలి ప్రశ్న వేసిన వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణపై ఆరోపణలు చేయడంతో టీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నదీ జలాలకు సంబంధించి జలవనరుల మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘మీరు మీ అంశాలను లేవనెత్తండి. మీకు సమయం ఇస్తాను. ఇది పద్ధతి కాదు’ అని స్పీకర్‌ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు అంతరాయం సృష్టించడంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను ఆయన తిరస్కరించారు.


మధ్యాహ్నం 12 గంటలకు సభ సమావేశమైన తర్వాత ప్రతిపక్షాల గందరగోళం మధ్యే ఇన్‌ లాండ్‌ వెసెల్స్‌ బిల్లు, అత్యవసర రక్షణ సేవల బిల్లులను ప్రవేశపెట్టారు. రక్షణ సేవల బిల్లు దుర్మార్గమైందని, గందరగోళం మధ్య ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టరాదని ఆర్‌ఎ్‌సపీ ఎంపీ ప్రేమచంద్రన్‌, కాంగ్రెస్‌ ఎంపి కె.సురేశ్‌ విమర్శించారు. అత్యవసర రక్షణ సర్వీసుల్లో ఉన్న వారు సమ్మెలు చేయకుండా నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. సభ్యుల అభ్యంతరాల మధ్య డిప్యూటీ స్పీకర్‌ మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. 2 గంటలకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ అత్యవసర రక్షణ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తుండగా సభ్యులు అడ్డుకున్నారు. సభ్యుల నిరసనల మధ్య ప్యానెల్‌ స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. అయినా ఇదే ప్రతిష్టంభన కొనసాగడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. 


పెద్దల సభలోనూ..

రాజ్యసభలో కూడా ఉదయం నుంచే ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను స్తంభింపచేశాయి. ‘సభ్యులకు సభాకార్యకలాపాలపై ఆసక్తి లేదు. దీంతో వాయిదా వేయక తప్పలేదు’ అని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. అప్పుడు కూడా గొడవ సద్దుమణగకపోవడంతో 2 గంటలకు వాయిదా వేశారు. 2 గంటలకు పెగాస్‌సపై వైష్ణవ్‌ మళ్లీ తన ప్రకటనను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. సభ్యుల గందరగోళంతో ఆయన ప్రకటనను సభలో ప్రవేశపెడుతున్నానని ప్రకటించారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. కాగా, ఉభయ సభల సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రె్‌సతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ గాంధీ విగ్రహం ముందు రైతుల సమస్యలపై నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పెగాసస్‌ స్పైవేర్‌తో  నిఘా సరికాదు: చైనా 


పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘాపెట్టడాన్ని చైనా ఖండించింది. సైబర్‌ నిఘాను అన్ని దేశాలకు ఎదురయ్యే సవాలుగా అభివర్ణించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎ్‌సవో గ్రూపు తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టారన్న అంతర్జాతీయ మీడియా కథనాల నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ గురువారం ఈ మేరకు స్పందించారు. ఇదే కనుక నిజమైతే చైనా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సైబర్‌ భద్రతకు సంబంధించిన ముప్పుపై అన్ని దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. చైనా నుంచి సైబర్‌ భద్రతా ముప్పు ఉందంటూ అమెరికా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. సైబర్‌ దాడులు ఎక్కువగా అమెరికా నుంచే జరుగుతున్నాయని ఆరోపించారు.