పెగాసస్‌పై రాహుల్ డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-23T21:24:37+05:30 IST

పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై..

పెగాసస్‌పై రాహుల్ డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌ను కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. స్పై వేర్ కేసులో ప్రతి అంశంపై తాము వివరణ ఇచ్చామని, దర్యాప్తు జరపాల్సిన అంశం అంటూ ఇందులో ఏదీలేదని హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజకీయ వైఫల్యాలు చవిచూస్తున్న వారే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని, మాట్లాడేందుకు ఎలాంటి అంశాలు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.


దీనికి ముందు, పెగాసస్ వ్యవహారంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై న్యాయవిచారణ జరిపించాలని, హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  పెగాసస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఉపయోగించిన ఆయుధమని రాహుల్ పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన పెగాసస్ ఆయుధాన్ని మోదీ ప్రభుత్వం మన దేశంలోనూ, మన సంస్థలపైన ఉపయోగించిందని ఆరోపించారు. కర్ణాటకలోనూ ఇదే అస్త్రం ఉపయోగించారని తప్పుపట్టారు. తన ఫోను కూడా ట్యాప్ చేశారని, దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలకు తన మిత్రులు సమాచారం ఇచ్చారని చెప్పారు.


ఆరోపణలపై ఇజ్రాయెల్ సమీక్ష

కాగా, ఎన్ఎస్ఓ గ్రూప్ సర్వెయిలెన్స్ సాఫ్ట్‌వేర్‌ దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సమీక్షకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. దీనిపై సమీక్షకు ఒక కమిటీ ఏర్పాటు చేయనుంది. లైసెన్స్ వ్యవహారంపై సమీక్ష చేసేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది.

Updated Date - 2021-07-23T21:24:37+05:30 IST