పెళ్లి కానుక.. ఎప్పటికో ఇక!

ABN , First Publish Date - 2021-07-31T04:46:16+05:30 IST

పెళ్లికానుక.. వివాహ ఖర్చుల్లో ఆసరాగా నిలుస్తుందనుకున్న పేదలకు అందని ద్రాక్షగా మిగిలిపపోతోంది.

పెళ్లి కానుక..  ఎప్పటికో ఇక!

అటకెక్కిన వైఎస్సార్‌ పెళ్లికానుక

డీఆర్‌డీఏలో సదరు విభాగం ఎత్తివేత

రిజిస్టర్‌ చేసుకున్నవారికి అందని నగదు

గతేడాది నుంచే ఆగిన పేర్ల నమోదు


పెళ్లికానుక.. వివాహ ఖర్చుల్లో ఆసరాగా నిలుస్తుందనుకున్న పేదలకు అందని ద్రాక్షగా మిగిలిపపోతోంది. కేటగిరీల వారీగా కానుకను పెంచిన ప్రభుత్వం దానిని కాగితాలకే పరిమితం చేసేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్కరికి కూడా ‘కానుక’ అందజేయలేదు. ఎప్పుడో 2018లో పేర్లు నమోదు చేసుకున్న వారు కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొత్తగా వివాహమెన వారు పేర్లు నమోదు చేసుకుందామనుకున్నా కుదరడం లేదు. మరోవైపు డీఆర్‌డీఏలో ఈ పథకం పర్యవేక్షణను చేస్తున్న ఉద్యోగుల విభాగాన్ని పూర్తిగా తొలగించేశారు.

- నెల్లూరు (హరనాథపురం)/పొదలకూరు


జీవితంలో మరచిపోలేని రీతిలో పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకొంటారు. కానీ పేదలకు అది ఆశగానే ఉంటుంది. ఇలాంటి స్థితిలో గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక పేరిట ఆర్థిక సాయం చేసేందుకు పథకం ప్రవేశపెట్టింది. పేదింటి వధువుకు ఆర్థిక సాయం  చేయడంతో ఆర్థిక భారం తగ్గింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుకగా మార్చారు. వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రెండేళ్లలో ఒక్కరికి కూడా కానుకలు అందించిన దాఖలాలు లేవు. దీంతో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ముస్లిం మహిళలు ఆర్థికంగా ఆసరా లేక ఇబ్బందులు పడుతున్నారు. 


10,221 మంది నమోదు


పెళ్లి కానుక పథకం కింద 2018-19లో డీఆర్‌డీఏ, మెప్మాలలో 10221 మంది తమ పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేసుకొన్నారు. డీఆర్‌డీఏ పరిధిలో 6,988 మంది, మెప్మా పరిధిలో 3,233 మంది ఉన్నారు. పెళ్లి కానుక నిధులు గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మంజూరు చేయలేదు.  పెళ్లిళ్ల రిజిసే్ట్రషన్లు మాత్రం మండల, పట్టణ సమాఖ్యలలో ఈ గత సంవత్సరం మార్చి 21 వరకు చేపట్టారు. మే నెల నుంచి ఈ కానుకకు సంబంధించిన పోర్టల్‌ పని చేయలేదు. వివాహాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ జరగలేదు. గత సంవత్సరం మార్చిలో లాక్‌డౌన సమయంలో 20 మంది మాత్రమే వివాహాలకు హాజరు కావాలనే ప్రభుత్వ మార్గదర్శకాలు ఉండటంతో ఆ సందర్భంలో జరిగిన వివాహాలకు కల్యాణమిత్రలు హాజరు కాలేదు. వారి పరిశీలన లేకపోవడంతో నూతన దంపతులకు నిధులు అందలేదు. కానీ నమోదులు గత సంవత్సరం మే నెల నుంచి జరుగలేదు. డీఆర్‌డీఏలో ఆ పథకం పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఉద్యోగుల విభాగాన్ని కూడా ఎత్తేశారు. దీనిని బట్టి చూస్తే అసలు ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశమే లేనట్టుగా స్పష్టం అవుతోంది. 


అమలుకు నోచుకోని హామీ


ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి పెళ్లి కానుకను కేటగిరీని బట్టి రూ.50వేల నుంచి  1.50 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు.  బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహానికి 1.20లక్షలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణకార్మికులకు రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన బాధ్యతలు స్వీకరించిన తరువాత పెళ్లికానుక మొత్తం పెంచి ఇస్తారని ఆయా వర్గాలు ఆశపడ్డాయి. 2019, సెప్టెంబరులో పెళ్లికానుక కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు 2020 ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, కరోనా కారణంగా గతేడాది మార్చి తరువాత పెళ్లికానుక దరఖాస్తుల స్వీకరణను నిలిపివేశారు. ఒక్క లబ్ధిదారుకు కూడా ఇప్పటివరకు పెళ్లికానుక అందజేయలేదు. తిరిగి ఇంతవరకు ప్రారంభించలేదు.   ఈ పథకం కింద పేర్లు  నమోదు చేసుకొన్న వారు  పెళ్లి కానుక కోసం డీఆర్‌డీఏ, మెప్మా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


నమోదు ప్రక్రియ నిలిచింది 


పెళ్లికానుక నమెదు ప్రక్రియ ప్రస్తుతం జరగటం లేదు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే నమోదు చేస్తాం. ఇప్పటికే నమోదైన దంపతులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వమే జమ చేస్తుంది. 

- సాంబశివారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్‌డీఏ


ఆదేశాలు అందితే నమోదు


పెళ్లికానుక నమోదుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది. ఆదేశాలు అందిన వెంటనే నమోదు చేస్తాం. ఈ కానుకకు సంబంధించి గత సంవత్సరం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ప్రస్తుతం నమోదు ప్రక్రియ ఆగిఉంది. 

- డీ. రవీంద్ర, పీడీ మెప్మా

  

దరఖాస్తు చేసుకున్నాం.. ఇంకా డబ్బు రాలేదు!


నాకు 2020, మార్చిలో వివాహమైంది. ఆ సమయంలో వైఎస్సార్‌ పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు డబ్బు రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. 

- మద్దూరు విజయలక్ష్మి, జయంపు, బాలాయపల్లి మండలం

Updated Date - 2021-07-31T04:46:16+05:30 IST