ఫొటో టాక్: నటన నేర్పుతున్న బాపు

చిన్న సినిమాలకు రాజేంద్రప్రసాద్‌ పెద్ద హీరోగా ఉన్న రోజుల్లో.. దర్శకుడు బాపు తీసిన సినిమా ‘పెళ్లిపుస్తకం’. విజయా వారి ‘మిస్సమ్మ’నే అటుఇటు తిప్పి ఈ చిత్రం రూపొందించారు. ఇందులో దివ్యవాణి కథానాయిక. సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే రూపొందింది. పద్మాలయా స్టూడియోలో వేసిన హీరోహీరోయిన్ల ఇంటి సెట్‌ ఆ రోజుల్లో ఎంతోమందిని ఆకర్షించింది. ఇంటి వెనుక భాగంలో పూల మొక్కలు ఏర్పాటు చేసి.. నెలరోజుల పాటు వాటిని పెంచారు. ప్రతిరోజూ సాయంత్రం ఓ వాటర్‌ ట్యాంకర్‌ను పిలిపించి అక్కడి చెట్లకు నీళ్లు పోయించేవారు. 


షూటింగ్‌ జరపకపోయినా ఆ నెల రోజులూ ఫ్లోర్‌కు అద్దె కట్టారు. ముళ్లపూడి మాటలు, ఆరుద్ర పాటలు, మహదేవన్‌ సంగీతం ‘పెళ్లిపుస్తకం’ చిత్రానికి వరంగా మారాయి. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌  ‘శ్రీరస్తు.. శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం’ పాట ఇప్పటికీ తెలుగునాట ఎవరింట పెళ్లి జరిగినా ఇదే పాట వినిపిస్తుంది. పెళ్లి వీడియోల్లోని ఆల్బమ్స్‌లో కూడా ఇదే పాట ఉంటుంది. పద్మాలయా స్టూడియోలో వేసిన సెట్‌లో రాజేంద్రప్రసాద్‌, దివ్యవాణిలకు ఎలా నటించాలో చూపిస్తున్న దర్శకుడు బాపుని ఈ స్టిల్‌లో చూడొచ్చు.

Advertisement
Advertisement