ఓల్డ్‌ కిలేడి!

ABN , First Publish Date - 2020-08-11T09:26:19+05:30 IST

తాను విశ్రాంత ఐఏఎస్‌ సుజాతరావునని..

ఓల్డ్‌ కిలేడి!

విశ్రాంత ఐఏఎస్ పేరుతో మోసం

గరుడ పూజ చేయిస్తానని నగదు వసూళ్లు

దుట్టా రవి ఫిర్యాదుతో అరెస్టు


హనుమాన్‌జంక్షన్‌(కృష్ణా): తాను విశ్రాంత ఐఏఎస్‌ సుజాతరావునని చెబుతూ తిరుపతిలో గరుడ సేవ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వృద్ధ మాయలాడిని సోమవారం హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి టౌనుకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి తాను ఆరోగ్య కమిటీ సభ్యురాలినని, విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి అని చెప్పి వైసీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావు నిర్వహిస్తున్న సీతామహాలక్ష్మి నర్సింగ్‌ హోమ్‌కు ఈ నెల 8న వెళ్లింది. డాక్టరు పేరు మీద తిరుపతిలో గరుడ పూజ నిర్వహిస్తానని పూజ ఖర్చుల కింద రూ.3500 ఇవ్వాలని అక్కడున్న వైద్య సిబ్బందిని అడిగింది. డాక్టర్‌ దుట్టా కూడా వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల కమిటీ సభ్యులు కావడంతో వారికి అనుమానం వచ్చి విషయాన్ని దుట్టా కుమారుడు రవిబాబు దృష్టికి తీసుకెళ్లారు.


ఆయన ఐఏఎస్‌ అధికారి సుజాతారావుకు ఫోన్‌ చేసి వివరాలు చెప్పారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు. తన పేరు చెప్పి గతంలో కూడా నందిగామ, హైదరాబాద్‌, విజయవాడ ప్రాంతాల్లో గుర్తు తెలియని మహిళలు డబ్బులు వసూళ్లు చేశారని వివరించారు. ప్రజల్ని మోసగిస్తున్న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సుజాతారావు సూచించారు. ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి నిందితురాలు ఉడాయించింది. దుట్టా రవిబాబు ఫిర్యాదుపై హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం విజయవాడలో అరెస్టు చేశారు.


తన వద్ద 50 ఎకరాల భూమి ఉందని సాగు చేయలేక పోతున్నానని ఆ భూమిని సాగు చేసుకొని బాగుపడాలని విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్‌ నాగబాబుకు మాయమాటలు చెప్పి అతని కారును కూడా వాడుకుంది. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లో నిందితురాలిని అరెస్టు చేసిన సీఐ డి.వి.రమణ, ఎస్‌ఐ మదీనబాషా పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 


ఇంతకీ ఎవరు ఈమె

హుందాగా, చేతి నిండా బంగారు గాజులు, మెడలో పెద్ద గొలుసులు కూడా ఉన్నాయి. వయస్సు 60పైనే ఉంటాయి. పోలీసులు మాత్రం ఆమె నుంచి పూర్తి వివరాలు రాబట్టలేకపోయారు. ఆధార్ కార్డు మాత్రం మంగళగిరి, మన్యం వారి వీధి, పేరుతో ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు, భర్త వివరాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. తాను గతంలో రిటైర్డు ఆర్డీఓ అని కొద్దిసేపు చెబుతోందని దానికి కూడా సరైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు విచారణలో రాబడతామని చెప్పారు.

Updated Date - 2020-08-11T09:26:19+05:30 IST