Abn logo
Sep 19 2021 @ 10:10AM

పెన్‌డ్రైవ్‌, సెల్‌ఫోన్లే కీలకం!

               - వాటిల్లోనే వీరమణి అక్రమార్జన వివరాల చిట్టా?


చెన్నై: అన్నాడీఎంకే మాజీ మంత్రి కేసీ వీరమణి నివాసగృహం నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌, హార్డ్‌ డిస్కులు, సెల్‌ఫోన్లలోని సమాచారం ఆధారంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన వివరాలను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు సేకరిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా వీరమణి ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టుకున్నారంటూ ఈనెల 15న వేలూరు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు వీరమణి నివాసగృహాలు, హోటళ్లు, బంధువుల నివాసగృహాలు సహా 35 చోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరమణి నివాసగృహం నుంచి ఎనిమిది హార్డ్‌ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో రూ.34 లక్షల నగదు, ఐదు కేజీల బంగారు నగలు, ఏడు కేజీల వెండి ఆభరణాలు, రోల్స్‌రాయిస్‌ సహా తొమ్మిది లగ్జరీ కార్లు కూడా స్వాధీనపరచకున్నారు. ఈ నేపథ్యంలో వీరమణి నివాసగృహం నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్కులలోని సమాచారాన్ని బట్టి ఆయన అక్రమ సంపాదనల వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. దాడులలో స్వాధీనం చేసుకున్న లగ్జరీకార్లకు సంబంధించిన వివరాలను ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల నుంచి సేకరించారు. ఆ కార్లను ఎవరికీ విక్రయించకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. వీరమణి నివాసగృహం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను ప్రభుత్వ ఖజానాకు తరలించారు. వీటిని కోర్టు అనుమతిస్తే వీరమణికి తిరిగి అప్పగించే అవకాశముంది.