పెండింగ్‌ పాస్‌బుక్‌లకు మోక్షమేది?

ABN , First Publish Date - 2020-11-22T09:29:00+05:30 IST

న్యాయస్థానాల్లో కేసుల్లేవు... రెవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు కూడా లేవు. క్లియర్‌ ఖాతాలు అని ప్రభుత్వమే చెబుతున్నా పాస్‌పుస్తకాలు..

పెండింగ్‌ పాస్‌బుక్‌లకు మోక్షమేది?

డిజిటల్‌ సంతకాల్లేక 3.33 లక్షల ఖాతాలకు జారీలో జాప్యం


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో కేసుల్లేవు... రెవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు కూడా లేవు. క్లియర్‌ ఖాతాలు అని ప్రభుత్వమే చెబుతున్నా పాస్‌పుస్తకాలు, ఆ రైతుల చేతికి రాలేదు. ఏకంగా రెండున్నరేళ్లుగా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో భూరికార్డుల నవీకరణ అనంతరం 32 జిల్లాల్లో వివాదాల్లేని 3,33,775 వ్యవసాయ ఖాతాలకు ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌పుస్తకం(ఈ-పీపీబీ) అందలేదు. 2017 భూ రికార్డుల నవీకరణ అనంతరం 2018 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 57.95 లక్షల ఖాతాలకు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే డిజిటల్‌ సంతకాలు చేసే క్రమంలో ఆయా ఖాతాలకు ఆధార్‌ కార్డును అనుసంధానం చేశారు.


ఈ క్రమంలో ఆధార్‌ కార్డులు లేవనే కారణంతో 1,71,823 ఖాతాలకు పాస్‌పుస్తకాలను పెండింగ్‌లో పెట్టారు. 1,61,952 ఖాతాలకు ఆధార్‌ కార్డులు ఉన్నప్పటికీ వాటిపై ఫొటోలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. పాస్‌పుస్తకాల జారీకి ఇబ్బందుల్లేకున్నా... అకారణంగా ఖాతాలకు డిజిటల్‌ సంతకాలు చేయకపోవడంతో 3.33 లక్షల ఖాతాలు పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో పడిపోయాయి. దాంతో ఆయా భూములను విక్రయించలేక... కనీసం రుణాలు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. ఆధార్‌ లేని 1,71,823 ఖాతాల విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 


దారులు క్లోజ్‌

గత సెప్టెంబరులోనే ప్రభుత్వం సమీకృత భూరికార్డుల యాజమాన్య విధానం(ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌) వెబ్‌సైట్‌ను మూతపెట్టింది. ఆ తర్వాత తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్‌ పాస్‌పుస్తకం చట్టం-2020ను ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టంతో రికార్డులపై తహసీల్దార్‌లకు ఉన్న అధికారాలన్నీ పూర్తిగా రద్దయ్యాయి.


ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయడం తప్ప ఏ వివాదాన్ని పరిష్కరించే అధికారం ప్రస్తుతం తహ సీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌, సీసీఎల్‌ఏకు కూడా లేదు. దాంతో క్షేత్రస్థాయిలో వివాదస్పద భూముల అంశాలే కాకుండా వివాదాల్లేని భూముల అంశాల జోలికి కూడా తహసీల్దార్లు వెళ్లలేని పరిస్థితి. అక్టోబరు 29వ తేదీన ధరణి ప్రారంభోత్సవం సమయంలోనే ఆధార్‌లేని ఖాతాలకు కూడా పాస్‌పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్‌ విధాన ప్రకటన చేసి, దాదాపు మూడు వారాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం తక్షణమే దీనిపై విధానం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2020-11-22T09:29:00+05:30 IST