విశాఖలోనే పెందుర్తి?

ABN , First Publish Date - 2022-01-28T06:51:47+05:30 IST

విశాఖ నగరానికి ఆనుకుని వున్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేయనున్న అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు.

విశాఖలోనే పెందుర్తి?

ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన

పలు కారణాలు వివరిస్తూ నివేదిక 

కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వసతిపై కసరత్తు

అనకాపల్లి, పాడేరుల్లో పలు భవనాలు పరిశీలన

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరానికి ఆనుకుని వున్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేయనున్న అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మల్లికార్జున చేసిన ప్రతిపాదన దీనికి బలం చేకూరుస్తున్నది. పెందుర్తిని విశాఖ జిల్లాలోనే ఎందుకు వుంచాలన్న దానికి ఆయన పలు కారణాలను వివరించినట్టు తెలిసింది. అదేవిధంగా అనకాపల్లి బదులు నర్సీపట్నంలో జిల్లా కేంద్రం ఏర్పాటుచేస్తే వసతి విషయంలో ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్టు జిల్లాకు చెందిన ఒక ముఖ్య అధికారి చెప్పారు.

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించనున్నట్టు గజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. ప్రతిపాదితి విశాఖ జిల్లాలో  ఎస్‌.కోట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అనకాపల్లిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరుతోపాటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ వుంటాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖ, అల్లూరి జిల్లాల పరిధి విషయంలో పెద్దగా అభ్యంతరాలు రానప్పటికీ అనకాపల్లి విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరానికి ఆనుకుని వున్న పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖ జిల్లాలోనే వుంచాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పెందుర్తికి విశాఖ కంటే అనకాపల్లి ఎక్కువ దూరంలో వుండడం, దాదాపు సగభాగం జీవీఎంసీ పరిధిలో వుండడం, జిల్లాలో వున్న పరిశ్రమల్లో ఎక్కువ శాతం అనకాపల్లి పరిధిలో వుండడం వంటి కారణాల వల్ల పెందుర్తిని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సైతం పెందుర్తి... విశాఖ జిల్లాలోనే ఉండాలని, ఈ నియోజకవర్గంలో మెజారిటీ జనాభా జీవీఎంసీలో ఉందని వివరించినట్టు తెలిసింది. ఇంకా పలు అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు సమాచారం. 

పరవాడ ఫార్మాసిటీ, ఎన్‌టీపీసీతోపాటు అచ్యుతాపురం, నక్కపల్లి (హెటెరో) సెజ్‌లు,  పాయకరావుపేటలో డెక్కన్‌ కెమికల్స్‌, తదితర పారిశ్రామిక ప్రాంతాలన్నీ అనకాపల్లి జిల్లా పరిధిలోకి వెళతాయి. ఇంకా మైనింగ్‌ మొత్తం అనకాపల్లి పరిధిలోనే ఉంటుంది. నగరంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, గాజువాక ఆటోనగర్‌లో కొన్ని పరిశ్రమలు మాత్రమే విశాఖ జిల్లాలో ఉంటాయి. దీంతో విశాఖ నగరం పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రాధాన్యం కోల్పోతుందని, అందువల్ల పెందుర్తిని విశాఖలో కొనసాగిస్తేనే మంచిదని అధికారులు భావించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

వసతిపై కసరత్తు

కొత్తగా ఏర్పాటుకానున్న అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనకాపల్లిలో తుమ్మపాల షుగర్స్‌, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో భవనాలను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆర్డీవో కార్యాలయం పరిసరాల్లో భూములు గుర్తించారు. కొత్త భవనాల నిర్మాణానికి కనీసం రూ.150 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే వసతి విషయంలో అనకాపల్లి కంటే నర్సీపట్నం మెరుగ్గా వుందని అధికారులు చెబుతున్నారు. అధికారులకు బంగ్లాలు, సిబ్బందికి క్వార్టర్స్‌ కూడా ఉన్నాయని, వీటికితోడు నర్సీపట్నం పరిసరాల్లో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములు వున్నాయని అఽఽధికారులు వివరిస్తున్నారు. 

కాగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేంద్రంగా ప్రతిపాదించిన పాడేరులో పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలను పరిశీలించారు. వసతి విషయంలో అనకాపల్లితో పోలిస్తే పాడేరు మెరుగ్గా వుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నందున వసతులకు సంబంధించి ఈలోగా నివేదిక తయారుచేసే అవకాశం ఉందని సమాచారం.


Updated Date - 2022-01-28T06:51:47+05:30 IST