పింఛన్‌ వంచన

ABN , First Publish Date - 2021-09-04T06:08:21+05:30 IST

అర్హులంతరికీ పింఛన్లు అందించి ఆదుకుంటామంటున్న ప్రభుత్వం వెరిఫికేషన్‌ పేరుతో వేలమందికి అన్యాయం చేస్తోంది.

పింఛన్‌ వంచన

7వేల సామాజిక పెన్షన్లు అవుట్‌

రెండు నెలలుగా అందని సొమ్ము

రకరకాల కొర్రీలతో భరోసాకు దూరం

రోగులకు అందే సాయం పోయే.. 

1,600 ఆరోగ్య పింఛన్లూ నిలిపివేత

వివిధ రకాల కారణాలతో కోత

లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు

నోటీసులు పంపుతున్న వైద్యారోగ్యశాఖ

రాచర్ల మండలం అనుమలపల్లె గ్రామానికి చెందిన పుట్టా గురుపార్థు నరాల బలహీనత కారణంగా మంచంలోనే ఉంటాడు. ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇచ్చే రూ.5వేల పింఛన్‌ కొంతకాలం అందుకున్నాడు. ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఇతనికి పింఛన్‌ ఇవ్వలేదు. మీ పింఛన్‌ రద్దయిందంటూ వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి లేఖ కూడా పంపించారు.


చీమకుర్తి మండలం బూదవాడ గ్రామానికి చెందిన ఎం.రమేష్‌ ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్య పింఛన్‌ కొంతకాలం అందుకున్నారు. రెండు నెలలుగా పింఛన్‌ రద్దు అయ్యిం దంటూ నిలిపివేశారు. లేచి నిలబడ లేని స్థితిలో ఉన్న రమేష్‌కు ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలే బతికేందుకు ఆధారం. 


ఇలా.. వైద్యారోగ్యశాఖ అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో వీరిద్దరివే కాదు ఏకంగా 1,600మంది పింఛన్లను నిలిపివేశారు. వాటిని రద్దుచేశామంటూ లేఖలు కూడా ఇళ్లకు పంపుతున్నారు. దీంతో రోగులు లబోదిబోమంటున్నారు. పింఛన్‌ సొమ్మే ఆధారంగా జీవిస్తున్న వీరికి చెల్లింపులు నిలిపివేయటంతో బతుకు దుర్భరంగా మారింది. కాళ్లూచేతులు చచ్చుపడిపోయి, తలలో నరాలు కూడా పనిచేయక జ్ఞానం కోల్పోయి మంచానికే పరిమితమైన వారికి మానసిక దివ్యాంగులంటూ పింఛన్లను నిలిపివేశారు. దీంతో వారు అల్లాడుతున్నారు. మరోవైపు సామాజిక పింఛన్లలోనూ  ఏడు వేల మందికి ప్రభుత్వం కోత పెట్టింది. వివిధ కారణాలతో రెండు నెలలుగా వారికి పంపిణీని నిలిపివేసింది. ఇలా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అభాగ్యుల నోట మట్టికొడుతోంది. 

ఒంగోలు నగరం, సెప్టెంబరు 3: అర్హులంతరికీ పింఛన్లు అందించి ఆదుకుంటామంటున్న ప్రభుత్వం వెరిఫికేషన్‌ పేరుతో వేలమందికి అన్యాయం చేస్తోంది.  ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పింఛన్లలో భారీగా కోత పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారి సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో అధికారులు మీరు అర్హులు కారు... ఇక పింఛన్‌ రాదంటూ తేల్చిచెప్పేస్తున్నారు. ఇలా జిల్లాలో 7వేల సామాజిక పింఛన్లు, 1,600 మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారి పింఛన్లను తొలగించేశారు. ప్రభుత్వం తీవ్రమైన తొమ్మిది రకాల జబ్బులతో బాధపడే వారికి నెలవారీ పింఛన్లను అందజేస్తోంది. రిమ్స్‌ నుంచి వైద్యుల బృందం ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆధారంగా ఇప్పటివరకు పింఛన్లను అందజేశారు. ఇప్పుడు మీరు అర్హులు కాదంటూ దీర్ఘకాలిక జబ్బులతో మంచానపడి జీవచ్ఛవాలుగా బతుకుతున్న వందలాది మందికి ఆసరా లేకుండా చేశారు.  


ఆగస్టు నుంచే నిలిపివేత

జిల్లాలో 3,751 మందికి ఆరోగ్య పింఛన్లను అందజేస్తున్నారు. వీరిలో 1,600మందికి ఆగస్టులో పంపిణీ చేయకుండా నిలిపివేశారు. వారి సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారికి అన్యాయం చేశారు. మొత్తం తొమ్మిది రకాల తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పింఛన్లను అందజేస్తున్నారు. అయితే ఇతర సామాజిక పింఛన్లతోపాటు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇచ్చే ఆరోగ్య పింఛన్లు తీసుకుంటున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించే కార్యక్రమాన్ని జూలైలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు చేపట్టారు. వ్యాధులతో బాధపడుతున్న వారిలో 1,600 మందికి మీరు అనర్హులు అంటూ ముందస్తుగా ఎటువంటి సమచారం ఇవ్వకుండానే ఆపేశారు.


ఏడాది కూడా ఇవ్వకుండానే..

నిబంధనల ప్రకారం తలసీమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తీవ్ర హిమోఫిలియా, ద్వైపాక్షిక బోఽధవ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీకి లేదా మంచానికి పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల బలహీనత ఉన్న వారు  ఆరోగ్య పింఛన్లకు అర్హులు. వీరితోపాటు  ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి, ఆరోగ్యశ్రీ ద్వారా గుండె, కిడ్నీ, కాలేయం, మార్పిడి చేయించుకున్న వారు, కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్‌ అందజేయాల్సి ఉంది. తలసీమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తీవ్ర హిమోఫిలియాతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10వేలు, మిగిలిన వ్యాధులకు రూ.5వేల వంతున ప్రతినెలా పింఛన్‌ అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒక్క కుష్ఠు వ్యాధిగ్రస్తులకు మాత్రం నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న 3,751మందికి ఆరోగ్య పింఛన్లను ఏడాది కూడా ఇవ్వకముందే చేతులెత్తేసింది.


బతుకులు దుర్భరమే!

ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపిందనే ఆరోపణలున్నాయి. 1,600 ఆరోగ్య పింఛన్లను రద్దు చేసి వారి బతుకులను వీధిన పడేసింది. ప్రస్తుతం వీరు తమ పింఛన్లను పునరుద్ధరించాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు అందిస్తున్న పింఛన్లను ఆగస్టు నుంచి నిలిపివేశారు. ఈనెలలో కూడా వీరికి పునరుద్ధరించలేదు. పైగా వీరికి  పింఛన్‌ను రద్దు చేస్తున్నట్లు ఇప్పుడు ఇళ్లకు నోటీసులు కూడా పంపిస్తున్నారు.. దీంతో ఆరోగ్య పింఛన్లు పొందుతున్న రోగులు లబోదిబోమంటున్నారు. తమకు ఇక దిక్కెవ్వరు.. తాము  ఎలా బతకాలంటూ వాపోతున్నారు.


7 వేల సామాజిక పింఛన్లు నిలిపివేత

జిల్లాలో అన్నిరకాలు కలిపి ఈ ఏడాది జూన్‌ నాటికి 4.29 లక్షల సామాజిక పింఛన్లు ఉన్నాయి. ఆగస్టు నాటికి వీటి సంఖ్య 4.26లక్షలు అయ్యాయి. అంటే 3వేలు పింఛన్లకు అధికారులు కత్తెరేశారు. మరో 4వేలమందికి పింఛన్‌ రద్దుచేయకుండానే పంపిణీ నిలిపివేశారు. వీరిలో ఒంటరి మహిళలు, వితంతువులు అధికంగా ఉన్నారు. ఒంటరి మహిళలైతే మీ రేషన్‌ కార్డులో ఇతర కుటుంబసభ్యుల పేర్లు ఎలా ఉన్నాయి? మీరు వితంతువు అయితే మీ రేషన్‌ కార్డులో మీ భర్త పేరు ఎందుకు ఉందంటూ పింఛన్‌ను నిలిపివేశారు. ఏళ్ళ క్రితం ఇచ్చిన రేషన్‌కార్డు అవకాశం ఉంటే అందులో భర్త పేరు తొలగించండి.. పింఛన్‌ మాత్రం ఇవ్వండి మహాప్రభో అంటూ మొరపెట్టుకుంటున్నా అధికారులు వినని పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలో ఏదో ఒక కుంటి సాకు చూపి 7వేల మందికి సామాజిక పింఛన్లను ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో పంపిణీ చేయకుండా నిలిపివేశారు. వీరికి తిరిగి పునరుద్ధరించే అవకాశమే లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.


ఇక ఏ నెలకు ఆ నెలే పింఛన్‌..

ఆగస్టుకు సంబంధించిన పింఛన్‌ సొమ్ము సెప్టెంబర్‌ ఒకటో తేదీన అందజేస్తారు. ఇలా ఆ నెల పింఛన్‌ లబ్ధిదారులకు తర్వాత నెల మొదటి రోజున అందజేస్తారు. ఒకవేళ ఒక నెలలో లబ్ధిదారుడికి పింఛన్‌ పంపిణీ కాకపోతే.. రెండు నెలలకు కలిసి ఆ తర్వాత నెలలో పింఛన్‌ కలిపి ఇచ్చే విధానం ఇప్పటివరకు కొనసాగుతోంది. ఇలా రెండు నెలలకు సంబంధించి ఫింఛన్‌ తీసుకోకపోతే ఆ తర్వాత మూడు నెలలకు కలిసి ఒకేసారి ఫింఛన్‌ ఇచ్చేవారు. ఈ నెల నుంచి ప్రభుత్వం నిబంధనలు మార్చేసింది. ఏ నెలకు ఆ నెల తీసుకోకపోతే ఆ తర్వాత నెల ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది. గతంలో విచారణ పేరుతో లబ్ధిదారురులకు ఒక నెల పింఛన్‌ ఇవ్వకపోయినా విచారణ పూర్తిచేసి ఆ తర్వాత నెలలో రెండూ కలిపి ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదంటున్నారు. ఇలా ప్రభుత్వం వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటూ అర్హులకు ఎగనామం పెడుతోంది.


Updated Date - 2021-09-04T06:08:21+05:30 IST