మాట నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్!

ABN , First Publish Date - 2021-07-13T06:46:27+05:30 IST

మాట తప్పను. మడమ తిప్పను...

మాట నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్!

మాట తప్పారు.. మడమా.. తిప్పారు

సామాజిక పింఛన సొమ్ము పెంపు హామీ ఒట్టిదేనా?

రెండేళ్లయినా నెరవేరని వాగ్దానం 

నేటికీ రూ. 2250తోనే సరి

పండుటాకుల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతాం. అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. మేనిఫెస్టోలోనూ పెడతాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రతిచోటా అప్పట్లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి హామీ ఇది.


ప్రియతమ నాయకుడు, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది రూ. 250లు చొప్పున పెంచబోతున్నాం. 2023 జూలై నాటికి ప్రతి అవ్వా, తాతలకు రూ. 3 వేలు ఇవ్వబోతున్నాం. అని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానమిది.


మాట తప్పను. మడమ తిప్పను. ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతానని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయంలో మాత్రం ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అధికారంలోకి రాగానే ఏడాదికేడాదికి రూ. 250లు పెంచుతూ 2023 నాటికి రూ. 3 వేలు ఇస్తానని హామీ ఇచ్చినా అది నేటికీ అమలు కాలేదు. ఈ నేపథ్యంలో  పింఛన్ల పెంపు ఉత్తిదేనా అన్న సందేహాలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఇచ్చిన హామీ మేరకు తొలి ఏడాది(2019 జూలై)లో పింఛన పెంచారు. ఆ మేరకు అమలు జరిగినట్లయితే ప్రస్తుతం ప్రతి లబ్ధిదారుడికి రూ. 2750లు అందాల్సి ఉంది. ఇక అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన వాగ్దానాన్ని పరిగణనలోకి తీసుకున్నా రూ. 2500లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకూ వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.


ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకుపైగా గడిచినప్పటికీ రూ. 2250లు పంపిణీతోనే సరిపెడుతున్నారు. దీన్నిబట్టి చూస్తే... సామాజిక పింఛన్ల పెంపు హామీగానే మిగిలిపోయే పరిస్థితి ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో పింఛన్ల పెంపు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. పింఛన్ల పెంపునకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.  



జిల్లాలో 4,38,667 మంది సామాజిక పింఛనదారులు

జిల్లాలో మొత్తం పింఛనదారులు 5,25,146 మంది ఉన్నారు. వీరిలో 66,253 మంది వికలాంగులు ఉండగా... కళాకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు 5685 మంది ఉన్నారు. వీరందరికి ప్రతి నెలా రూ. 3 వేలు పింఛన అందజేస్తున్నారు. ఇక ప్రతి నెలా రూ. 10 వేలు, రూ. 5 వేలు పింఛన పొందుతున్న వారిలో కిడ్నీ, థలసీమియా, సికిల్‌సెల్‌, పక్షవాతం, ప్రమాదాల్లో గాయపడి మంచానికే పరిమితమైన వారు, సైనిక్‌ వెల్ఫేర్‌ కోటాలో లబ్ధి పొందుతున్న వారిలో 7599 మంది ఉన్నారు. అభయహస్తం కింద లబ్ధిపొందుతున్న వారు 6942 మంది ఉన్నారు. వీరికి రూ. 500లు చొప్పున ప్రతినెలా అందజేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే మొత్తం పింఛనదారుల్లో 86,479 మంది ఆయా కేటగిరీల పరిధిలో నిర్దేశించిన మేరకు పింఛన పొందుతున్న వారిని పక్కనబెడితే మిగిలిన 4,38,667 మంది సామాజిక పింఛనదారులు పింఛన పెంపు సొమ్ము లబ్ధిని కోల్పోయిన వారిలో ఉన్నారు. 


రూ. 153.52 కోట్ల పింఛన పెంపు సొమ్ము కోల్పోయిన లబ్ధిదారులు

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 తొలి ఏడాది జూలైలో రూ. 2250లు పింఛన సొమ్ము పెంచి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏడాదికే డాదికి పింఛన సొమ్ము రూ. 250లు చొప్పున పెంచినట్లయితే 2020 జూలై నాటికి ప్రతి లబ్ధిదారుడికి రూ. 2500లు, ఈ ఏడాదిలో ఈ నెలలో పింఛన సొమ్ము రూ. 2750లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ సామాజిక పింఛనదారులకు రూ. 2250లు చొప్పున పంపిణీ చేస్తున్నారు. పింఛన పెంపు వర్తించే లబ్ధిదారులు (సామాజిక పింఛనదారులు) మొత్తం రూ. 4,38,667 మంది ఉన్నారు. గత ఏడాది(2020) జూలై నుంచి పింఛన సొమ్ము అదనంగా మరో రూ. 250లకు పెంచి ఉన్నట్లయితే లబ్ధిదారుడికి రూ. 2500లు దక్కేది. ఆ విధంగా అమలు చేయకపోవడంతో నెలకు రూ.  10.96 కోట్లు  కోల్పోవాల్సి వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 131.60 కోట్లు కోల్పోయినట్లయింది.  ఈ ఏడాది జూలైకు పింఛన సొమ్ము మరో రూ. 250లు పెంచి ఉంటే రూ. 2750లు లబ్ధిదారుడికి దక్కేది. ఈ లెక్కన ఈ నెలకు రూ. 2250కు బదులుగా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 2750లు పంపిణీ చేసి ఉంటే రూ. 21.92 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉండేది. మొత్తానికి పింఛన సొమ్ము పెంచకపోవడంతో ఇప్పటి వరకూ లబ్ధిదారులు రూ. 153.52 కోట్ల లబ్ధిని కోల్పోవాల్సి వచ్చింది. కనీసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి అసెంబ్లీలో చేసిన వాగ్దానం మేరకు పింఛన్ల పెంపు అమలైనట్లయితే ఈపాటికి ప్రతి లబ్ధిదారుడికి రూ. 2500లు దక్కేది.  జగన వాగ్దానం మేరకు లబ్ధిదారులు ఈ నెలలోనూ అదనంగా రూ. 10.96 కోట్లు లబ్ధిని కోల్పోయారు.


అవ్వాతాతల ఆశలపై నీళ్లు...

ఏడాదికేడాదికి పింఛన్ల పెంపు హామీ అమలు కాకపోవడంతో అవ్వా,తాతల ఆశలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన నీళ్లు చల్లినట్లయింది. ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత కార్మికులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు పింఛన పెంపు తమ జీవితాల్లో ఆసరాగా నిలుస్తుందని ఆశపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచినప్పటికీ పింఛన సొమ్ము పెంచకపోవడంతో ఆ వర్గాలన్నీ నిట్టూరుస్తున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టు కోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని సామాజిక పింఛనదారులు ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-07-13T06:46:27+05:30 IST