జగన్ సర్కార్‌కు పెన్షన్ పరీక్ష

ABN , First Publish Date - 2022-05-04T07:34:42+05:30 IST

నూతన పెన్షన్‌ స్కీం రద్దు చేయాలని రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. సిపిఎస్‌ (కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) అని పిలిచే దీనిని తాము అధికారంలోనికి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామని...

జగన్ సర్కార్‌కు పెన్షన్ పరీక్ష

నూతన పెన్షన్‌ స్కీం రద్దు చేయాలని రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. సిపిఎస్‌ (కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) అని పిలిచే దీనిని తాము అధికారంలోనికి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. తమ ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే పేర్కొన్నారు. మూడేళ్లు గడిచినా నేటికీ ఆ పని చేయలేదు సరికదా, ఏదో అవగాహన లేకుండా అలా హామీ ఇచ్చామని, దీన్ని రద్దు చేయడం సాధ్యం కాదని ఇప్పుడు సెలవిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌) అనే కొత్త పల్లవి ఎత్తుకుంది. దీనిని సంఘాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. భారీ ప్రకటనలు ఇస్తోంది. పోనీ వాటిలోనైనా వాస్తవాలు చెబుతోందా అంటే అదీ లేదు. ఉదాహరణకు పెన్షన్‌ తక్కువరావడానికి కారణం వడ్డీరేట్లని తెలిపింది. కానీ వాస్తవమేమిటంటే ఆ నిధులతో షేర్‌ మార్కెట్లో జూదమాడడమే ప్రధాన కారణం. దీనిని ప్రభుత్వం మరుగునపరిచి, ఆలోచించమని ఉద్యోగులకు నేరుగా విజ్ఞప్తి చేస్తోంది. సమాజానికి పాఠాలు నేర్పే గురువులు ఆ మాత్రం ఆలోచించలేని స్థితిలో ఉన్నారనుకోవడం అవివేకమే. మరి ఇక మిగిలిన ఏకైక పరిష్కారం దీనిని రద్దు చేసి, పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించడమే. అది ఎలాగన్నదే అసలు సమస్య. ఇది తెలియాలంటే దీని మూలాలలోనికి వెళ్ళవలసిందే.


2003 అక్టోబరు 10న కేంద్రంలోని నాటి వాజపేయి ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు ద్వారా అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకున్న పెన్షన్‌ స్కీం స్థానంలో నేషనల్‌ పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌) అనే దానిని ప్రవేశపెట్టింది. దీనికనుగుణంగా ప్రభుత్వం పిఎఫ్‌ఆర్డీఏ (పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటి) చట్టాన్ని చేసింది. 2014 జనవరి 1 తరువాత ఆర్మీ సర్వీసులు మినహా మిగిలిన కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్లలో చేరిన ప్రతి ఉద్యోగికీ, తప్పనిసరిగా ఇది వర్తించేలా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 10 శాతం, యాజమాన్యం నుంచి 10 శాతంతో పెన్షన్‌ నిధిని ఏర్పాటు చేస్తారు. నిర్వహణ కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, ప్రవేట్ సంస్థలతో కూడిన ఒక కన్సార్టియం సారథ్యంలో నిధులను షేర్‌ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. పెన్షన్‌ చెల్లించే రోజుకు షేర్‌ మార్కెట్‌ విలువను బట్టి ఎంత పెన్షన్‌ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఈ చట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే 2003లో ఆర్డినెన్సు ద్వారా అమలు ప్రారంభమైన పదేళ్ళు అంటే 2013కు గాని ఇది చట్ట రూపం తీసుకోలేదు. ఇదే చట్టం సెక్షన్‌ 12(4)లో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర పాలిత ప్రాతంగాని దీనిలో చేరవచ్చని పేర్కొన్నారు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సెక్షన్‌ 12(5) ద్వారా మిగిలిన ఏ సంస్థనైనా దీనిలో చేర్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. ఈ అధికారం ద్వారానే ఎల్‌ఐసి, బ్యాంకులు వంటి సంస్థలలో 2010 తరువాత చేరిన ఉద్యోగులందరికి దీనిని వర్తింపచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దీనిలో చేరడానికి నిర్ణయించడంతో మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది 2004 సెప్టెంబరు 1 నుంచి అమలవుతోంది. అంటే అంతకు ముందు వారందరికీ పాత పెన్షన్‌ విధానం, తరువాత చేరిన వారికి ఈ పెన్షన్‌ విధానం, అలా ఒకే యాజమాన్యంలో పనిచేస్తున్న వారికి వేర్వేరు పెన్షన్‌ విధానాలు అమలుకావడం ప్రారంభమయింది. పాతదానికి, కొత్తదానికి ప్రధానమైన తేడా ఏమిటంటే పాత పెన్షన్‌ స్కీంలో ఉద్యోగికి ఎంత పెన్షన్‌ వస్తుందో గ్యారంటీ చేస్తే, కొత్త పెన్షన్‌ స్కీంలో ఉద్యోగి దీనికి ఎంత చెల్లించాలో నిర్దేశించారు, కానీ పెన్షన్‌ ఎంత వస్తుందో గ్యారంటీ మాత్రం చేయలేదు. ఇదే ఇందులోని ప్రధాన లోపం.


ఈ పెన్షన్‌ స్కీం చాలా నష్టకరమని కొన్ని పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు దీనిని ఆది నుండీ వ్యతిరేకిస్తూ వచ్చాయి. వాస్తవంగా వీరి వ్యతిరేకత వల్లే ఇది పదేళ్ళపాటు చట్ట రూపం కూడా తీసుకోలేదు. వామపక్షాలు కేవలం పార్లమెంటులో వ్యతిరేకతతోనే సరిపెట్టకుండా, తాము అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో దీనిలో చేరడానికి నిరాకరించాయి. అందువల్లే దేశంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త పెన్షన్‌ అమలయితే ఈ మూడు రాష్ట్రాలలోనూ మాత్రం పాత పెన్షనే అమలవుతూ వచ్చింది. అయితే కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2013లో దీనిలో చేరిపోయింది. త్రిపురలో 2018లో అధికారంలోనికి వచ్చిన బిజెపి ప్రభత్వం దీనిలో తన ఉద్యోగులను చేర్చేసింది. ఇక నేడు దీనిలో చేరకుండా ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ మాత్రమే.


కొంతమంది భావిస్తున్నట్లు పాత పెన్షన్‌ విధానం కూడా ఊరికే ప్రభుత్వమేమీ తన స్వంత నిధులతోనే ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) నిబంధనల ప్రకారం ప్రకారం ఉద్యోగి తన జీతం నుంచి ఎంత పిఎఫ్‌ జమ చేస్తాడో అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పిఎఫ్‌ ఖాతాకు యజమాని కూడా చెల్లించాలి. ఇప్పుడు ఉద్యోగి తన జీతంలో 10 శాతం చెల్లిస్తున్నాడు. ప్రభుత్వం తాను చెల్లించవలసిన 10 శాతాన్ని మినహాయించి, ఆ సొమ్ముతో ఉద్యోగికి పెన్షన్‌ పాత విధానంలో చెల్లిస్తోంది. అందువల్ల పాత పెన్షన్‌ స్కీం కూడా వాస్తవంగా ప్రభుత్వానికి భారమేమీ కాదు. ఎందువల్లంటే ఉద్యోగి సర్వీసు కాలమంతా తన వద్దే ఆ సొమ్మును అట్టే పెట్టుకుని, ఉద్యోగి రిటైర్‌ అయిన తరువాత మాత్రమే నెలకు ఇంత చొప్పున ప్రభుత్వం పెన్షన్‌ రూపంలో చెల్లిస్తోంది. ఇక కొత్త పెన్షన్‌ విధానమయితే ఉద్యోగి జీతం నుండి పెన్షన్‌ నిధికి నెలకు 10 శాతం చెల్లిస్తే, యాజమాన్యం కూడా అంతకంటే తగ్గకుండా చెల్లించాలి. అంటే గత పెన్షన్‌ నిధి కేవలం యాజమాన్యం 10 శాతం వాటాతో నడిస్తే, నేడు ఉద్యోగి వాటా కూడా కలుపుకుని దీనికి కనీసం రెట్టింపు నిధులు సమకూరుతున్నాయి. దీనర్ధం పై లెక్క ప్రకారం చూస్తే, 30 ఏళ్లలో పెన్షన్‌ నిధి రెట్టింపుగా 90 లక్షల రూపాయలవుతుంది. ఈ నిధి నుండి ఉద్యోగికి రెట్టింపు పెన్షన్‌ చెల్లించినా ప్రభుత్వానికేమీ నష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఎంత చెల్లిస్తారో కూడా గ్యారంటీ లేదు.


మార్చి 2022 నాటికి ఈ ఎన్‌పిఎస్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 23 లక్షల మంది, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు 56 లక్షల మంది ఉన్నారు. వీరు నెలవారీ చెల్లించిన నిధులు కూడా భారీ స్థాయిలో 7లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ట్రస్టు వద్ద ఉన్నాయి. ఈ నిధులను షేర్‌ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించడానికి ప్రభుత్వం రిలయన్స్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి కార్పొరేట్‌ సంస్థలతోనే పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్స్‌ను నియమించింది. వారు సహజంగానే తమ కంపెనీల లాభాలకే ప్రాధాన్యమిస్తారు గానీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతారా? అందువల్ల ఈ నూతన పెన్షన్‌ విధానం ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్‌ సంస్థలు కొల్లగొట్టుకుపోవడం తప్ప మరొకటి కాదు. ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత గౌరవప్రదమైన జీవనం సాగించడానికి, పెన్షన్‌ రాజ్యాంగపర హక్కు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక తీర్పులలో పేర్కొంది. అయితే ఈ హక్కును కాలరాసేలా నేటి ఎన్‌పిఎస్‌ ఉంది. ఇటువంటి ముదనష్టపు స్కీం నుంచి బయటపడి, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడడానికి ఇటీవల రాజస్థాన్‌, కేరళ, డిల్లీ, తమిళనాడు వంటి కొన్ని బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాలు కార్పొరేట్‌ సేవలో మునిగి తేలుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇంపుగా లేకపోవచ్చేమో గాని, ఉద్యోగులకు మాత్రం గొప్ప వరంగానే మారుతాయి. అదే చట్టం సెక్షన్‌ 12(3)(సి) ద్వారా కొన్ని స్వతంత్ర పెన్షన్‌ స్కీంలను ఈ చట్ట పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించవచ్చు. కానీ జగన్‌ ప్రభుత్వం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోందో అర్థం కాని విషయమే. సమస్యను ఇప్పటికీ అవగాహన చేసుకోకుండా, గట్టిగా అడుగుతున్న ఉద్యోగులపై నిర్భంధం ప్రయోగించడం మొరటు పద్దతిలో వ్యవహరించడం తప్ప ఇంకేమనుకోగలం? దానికి బదులుగా ఈ స్కీం నుండి బయటకురావాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ఉమ్మడిగా నడవడమే తెలివైన పని. నిర్బంధం వీడి, ఇంకేమాత్రం కాలయాపన లేకుండా సరైన పంథా అవలంభించడమే వివేకం అనుపించుకుంటుంది. అటువంటి విజ్ఞత జగన్‌ ప్రభుత్వం ప్రదర్శిస్తుందా? లేదా? అన్నది వేచి చూడవలసిందే.

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Read more