ఆసరా.. ఆశ..!

ABN , First Publish Date - 2022-08-07T06:04:03+05:30 IST

గ్రేటర్‌లో 57ఏళ్లు దాటిన వారిలో ఆసరా పింఛన్ల ఆశలు మరోసారి రెక్కలు తొడిగాయి.

ఆసరా.. ఆశ..!

కొత్త దరఖాస్తులు 58వేలు  

పెండింగ్‌లో 6 వేల పాత దరఖాస్తులు 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో 57ఏళ్లు దాటిన వారిలో ఆసరా పింఛన్ల ఆశలు మరోసారి రెక్కలు తొడిగాయి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు సీఎం కేసీఆర్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 58వేల దరఖాస్తులు..

జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల పరిధిలో వివిధ కేటగిరీల్లో ప్రస్తుతం 1.98 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక వయసును 65 నుంచి 57 ఏళ్ల వరకు సడలించిన నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టు 31 వరకు మీ సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా జిల్లాలో దాదాపు 58వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 

వచ్చేనా.. ఆగేనా..!

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 65 ఏళ్లు నిండిన వృద్ధుల దరఖాస్తులు కుప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2019 జూలై వరకు హైదరాబాద్‌ జిల్లాలో 6వేల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాతవారితోపాటు కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి సైతం ఆగస్టు 15 నుంచి పింఛన్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. గతంలో కొత్త పింఛన్లపై రెండు, మూడుసార్లు ప్రకటన చేసినా ఆచరణ సాధ్యం కాలేదని, తాజా ప్రకటన అలాగే ఉంటుందా.. అమలుకు నోచుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారిందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఆసరా పింఛన్‌ ప్రకటన దరఖాస్తుదారుల్లో మళ్లీ ఆశలు లేపిందని చెప్పవచ్చు.

Updated Date - 2022-08-07T06:04:03+05:30 IST