విజయవాడ వ్యాప్తంగా లక్ష పింఛన్ల నిలిపివేత.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2020-02-05T21:16:31+05:30 IST

విజయవాడ వ్యాప్తంగా లక్ష పింఛన్ల నిలిపివేత.. ఎందుకంటే..

విజయవాడ వ్యాప్తంగా లక్ష పింఛన్ల నిలిపివేత.. ఎందుకంటే..

  • పింఛన్ల నిలుపుదలపై వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆగ్రహం
  • సర్వే పేరుతో సాకులు చూపి పెన్షన్లు నిలిపివేశారంటూ ఆవేదన

 వారంతా నిస్సహాయులు, పదుల సంవత్సరాలు పిల్లల కోసం కష్టించి ముదిమికొచ్చాక మందుల కోసమో, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికో పింఛన్‌నే ఊతంగా చేసుకుని బతుకుతున్న పండుటాకులు.. జీవితాంతం తోడుంటానన్న వాడు మధ్యలోనే మరణిస్తే పెన్షన్‌ వస్తుందిలేనన్న భరోసాతో బతుకుతున్న వితంతువులు.. శారీరక వైకల్యమున్నా ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యంతో ప్రభుత్వమిచ్చే పింఛన్‌నే ఆసరాగా చేసుకుని జీవన పోరాటం చేస్తున్న దివ్యాంగులు. ఇన్నాళ్లూ బాగానే పింఛన్లు తీసుకున్నారు. నవశకం సర్వేలో వారు నిస్సహాయులు కాదు, భూస్వాములు, ఇన్‌కంట్యాక్సు కడుతున్నారు, కరెంటు బాగా వాడుతున్నారు, కార్లున్నాయని రావడంతో ప్రభుత్వం పింఛన్లు నిలపివేసింది. దీంతో దిక్కుతోచని వారు ఏమాత్రం ఆర్థిక దన్ను లేని తాము బతికేదెలా అంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. 

అరెకరముంటే ఏడెకరాలు ఉందంటున్నారు..  నిజాంపట్నం చిన్నమ్మాయి, వేకనూరు, అవనిగడ్డ మండలం

 నాకు 50 సెంట్ల మాగాణి భూమి ఉంది. గ్రామంలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఓ రేకులింట్లో ఉంటున్నా. వితంతు పింఛన్‌ తీసుకుంటున్నా. ఇటీవల చేసిన నవశకం సర్వేలో ఆధార్‌ కార్డులో 7 ఎకరాలు పొలం ఉన్నట్లుగా వచ్చిందని పింఛన్‌ నిలిపేశారు.

 

తప్పులుంటే సరిచేస్తాం.. బి.ఎం. లక్ష్మీకుమారి, ఎండీవో, అవనిగడ్డ

అవనిగడ్డ సర్వేలో వచ్చిన దాన్ని బట్టి కొంతమంది పింఛన్లను పునర్విచారణ కోసం నిలుపుదల చేశాం. అంతమాత్రాన వారి పింఛన్‌ పూర్తిగా పోయినట్లు కాదు. సర్వేలో వచ్చిన వివరాలు తప్పయితే వాటిని సరిచేసుకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో తప్పులను సరిచేస్తారు. భూమి వివరాలు సచివాలయంలో సమర్పిస్తే వెంటనే వారి పింఛన్‌ పునరుద్ధరిస్తాం.

 

నవశకం నిర్లక్ష్యపు ఆనవాళ్లు..  బచ్చు దుర్గా ప్రసాద్‌, మోదుమూడి, అవనిగడ్డ మండలం

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన దాసరి బాలకృష్ణ మానసిక వికలాంగుడు. ఈయనకు విద్యుత్తు బిల్లు 300 యూనిట్లు దాటిందంటూ పింఛన్‌ నిలిపివేశారు. మూడు పోర్షన్లు ఉన్న ఇంటిలో ఉండడమే బాలకృష్ణ చేసిన తప్పు. మూడు పోర్షన్లకు కలిపి ఒకే విద్యుత్తు మీటరు ఉండడంతో విద్యుత్తు వాడకం 300 యూనిట్లు దాటింది.

 

మచిలీపట్నానికి చెందిన దివ్యాంగుడు స్వామికి కార్లు ఉన్నాయని ఇన్‌కంట్యాక్సు కడుతున్నారని పింఛన్‌ నిలిపివేశారు. పింఛన్‌ డబ్బులు లేకపోతే ఇల్లు కూడా గడవని నాకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదని స్వామి వాపోయారు. 

మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మికి వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. పొలాలు ఉన్నాయని పింఛన్‌ నిలిపివేశామని అధికారులు చెప్పారు. తనకు కుంట పొలం లేదని ఆమె మొత్తుకుంటున్నా వినే నాథుడు లేడు.

 

మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు సులోచన 300 యూనిట్ల విద్యుత్తు వాడారని పింఛన్‌ నిలిపివేశారు. తన ఇంట్లో ఉండే మూడు లైట్లకు అంత బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదని ఇదే విషయాన్ని అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.

మచిలీపట్నానికి చెందిన మెహబూబ్‌, సత్యవతికి భారీగా ఆస్తులు ఉన్నాయంటూ పింఛన్‌ ఆపేశారు. తమ ఇళ్లకు వస్తే తమ కుటుంబ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని వారంటున్నారు.

మచిలీపట్నంలో సుమారు 3వేల మంది అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు నిలిపివేశారు. అవనిగడ్డ మండలంలో 423 మంది పింఛన్లు నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష పింఛన్లు రకరకాల కారణాలతో నిలిపివేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు తప్పులుంటే సరిచేస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు.

పదెకరాలుందంటున్నారు 

గ్రామంలో నా పేరున 60 సెంట్లు, నా భార్య పేరున 75 సెంట్ల భూమి ఉంది. మొత్తం ఎకరం 35 సెంట్లలో ఎకరం భూమిని నా కుమార్తెకు పసుపు కుంకుమ కింద ఇచ్చా. మిగిలిన 35 సెంట్లలో వచ్చే ఆదాయం, వృద్ధాప్య పింఛన్‌ డబ్బులతోనే బతుకుతున్నాం. ఇటీల చేసిన సర్వేలో పదెకరాలు నా పేరున ఉందని పింఛన్‌ నిలపేశారు.

 

పింఛన్‌ తొలగించారని దివ్యాంగుడి ధర్నా

గుడివాడటౌన్‌: ఇరవై ఏళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్న తనకు రేషన్‌కార్డు లేదని నిలుపుదల చేశారని ఓ దివ్యాంగుడు గుడివాడలో ఆవేదన వ్యక్తం చేశారు. 9వ వార్డు ఎర్రబడ్డీ సెంటర్‌కు చెందిన గొన్నా బత్తుల పూర్ణచంద్రరావు దివ్యాంగుల పింఛన్‌ తీసేశారంటూ మంగళవారం కొత్త మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రేషన్‌ కార్డు కోసం కొన్నేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. తన భార్య దివ్యాంగురాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పింఛన్‌ ఇప్పించాలంటూ మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చే అధికారులను వేడుకుంటున్నారు. సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించబోనని అక్కడే బైఠాయించారు.

Updated Date - 2020-02-05T21:16:31+05:30 IST