Abn logo
Oct 27 2021 @ 23:00PM

పింఛన్లు ఆపి రోడ్డున పడేశారు..!

చెరుకుపల్లి సుబ్బారావు, మస్తాన్‌ బాషా

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

సరైన కారణం చెప్పలేని వలంటీర్లు

వందల సంఖ్యలో బాధితులు

ఎందుకు తొలగించారో చెప్పండి సారూ...


పొదిలి (రూరల్‌) అక్టోబరు 27 : మండలంలో అక్టోబరులో సుమారు వందల సంఖ్యలో అన్ని రకాల వర్గాలకు సంబంధించిన పింఛన్లు ఎలాంటి కారణాలు లేకుండానే తొలగించారు. ఎందుకు తొలగించారంటే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. కారణం లేకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తే కుంటి సాకులతో అధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. దివ్యాంగులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎందుకు వారి పింఛన్‌లు తొలగించారో తెలిపేందుకు వలంటీర్లు గానీ,  సచివాలయ ఉద్యోగులు గానీ సమాధానం చెప్పడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. అధికారులను పశ్నిస్తే తమ దగ్గర ఆ జాబితా లేదు.. ఇంత పర్సంటేజీ మాత్రమే వస్తుంది ఎవరిని ఎందుకు తొలగించారో.. ఎన్ని తొలగించారో డేటా లేదని చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అన్న సహాయంతో బతుకుతున్నా

మస్తాన్‌ బాషా, పొదిలి, పెన్షన్‌ ఐడీ  : 10864240

నేను మూడు చక్రాల బండి సహాయం ఉంటేనే బయటకు రాగలను. అమ్మా-నాన్న లేరు. నేను అన్న అహ్మద్‌బాషా సహాయంతో జీవనం సాగిస్తున్నా. నాకు అక్టోబర్‌ నుంచి పెన్షన్‌ నిలిపివేశారు. ఎందుకు నా పింఛన్‌ ఆపారని వలంటీర్‌ని అడిగా. నీకు రేషన్‌ కార్డు లేదని పింఛన్‌ నిలిపివేశారని తెలిపాడు. రూ.70 ఉన్నప్పటి నుంచి నాకు పింఛన్‌ అందుతుందని, ఇప్పుడు ఒక్కసారిగా ఆపేస్తే ఎలా బతకాలి. ఇప్పటి వరకు నా అన్న రేషన్‌ కార్డు పేరు మీదనే పింఛన్‌ పొందుతున్నా. కార్డులో నుంచి పేరు ఎలా తీస్తారు. ఆ విషయం ఎందుకు చెప్పలేదని వలంటీర్‌ని నిలదీయగా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి అన్న పేరుతో ఉన్న కార్డులో నుంచి నా పేరును ఇప్పుడెలా తొలగిస్తారు. రేషన్‌ కార్డు నుంచి నా పేరును తొలగించాలనేవారు నా పేరుతో కార్డు ఇచ్చాక ఆ పని చేసి ఉండాలి. పింఛన్‌పై ఆధారపడి బతికేవాళ్లకు ఇబ్బంది కల్పించడం ఎంతవరకు న్యాయం.


మూడు నెలలుగా పెన్ష్‌న్‌ ఆపారు

చెరుకుపల్లి సుబ్బారావు, పొదిలి, పెన్షన్‌ ఐడీ : 108 650 333

నేను ఇస్ర్తీ చేసుకొని జీవనం సాగిస్తున్నా. నాకు మూడు నెలలుగా పింఛన్‌ ఆపేశారు. ఎందుకు ఆపారో కూడా తెలియదు. నీ ఆధార్‌కార్డు తెలంగాణాలో చూపిస్తుందని అందుకు ఆపారని వలంటీర్‌ సమాధానం ఇచ్చాడు. బతుకుదెరువు కోసం అప్పుడు నిజామబాద్‌ వెళ్లాం. అక్కడ ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో నాకాలు విరిగింది. ఆ తరువాత స్వగ్రామం పొదిలి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పింఛన్‌ వస్తుంది. ఒక్కసారిగా పెన్షన్‌ ఆపేస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశా.