టీడీపీకి ఓటేశారని పింఛన్లు ఆపేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-07T03:40:13+05:30 IST

మండలంలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులతో పాటు పింఛనుదారులను

టీడీపీకి ఓటేశారని పింఛన్లు ఆపేస్తున్నారు!

వలంటీర్లే ప్రధాన కారకులు

అధికార నేతల ఒత్తిడితోనే..

రెండునెలలుగా ఇదే తంతు 

సాకులతో లబ్ధిదారులకు వేధింపులు

 పట్టించుకోని అధికారులు

కొండాపురం, మే 6: మండలంలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులతో పాటు పింఛనుదారులను అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ఎన్నికలన్నీ ముగిసినప్పటికీ రాజకీయ వేడి చల్లారలేదు. ఈ విషయాలపై అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలు పింఛన్లు పంపిణీ చేస్తుండేవారు. నేడు ప్రభుత్వం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్లకు అప్పగించింది. వేలిముద్రలు పడని వ్యక్తుల పింఛన్లను వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ఇస్తూ మిగిలిన వారికి పంచే బాధ్యత పూర్తిగా వలంటీర్లకే కేటాయించారు. ఇక్కడ నుండే సమస్యలు మొదలయ్యాయి. ఆయా గ్రామ నాయకుల సూచనల మేరకు 50 ఇళ్ల పరిధిలో ఉండే వలంటీర్లు ఖచ్చితమైన గుర్తింపుతో టీడీపీ మద్దతుదారుల పింఛన్లను ఏదో ఒక విధంగా ఆపేస్తున్నారు.

వలంటీర్లే బ్లాక్‌ చేస్తున్నారు..

నేకునాంపేట పంచాయతీ తూర్పుపాలెం గ్రామంలోనే ఉంటున్న దాదాపు 11 మంది పింఛన్లను రెండునెలలుగా ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందులో 5 మందివి మూడునెలల నుంచి ఇవ్వడం లేదు. మరో 6 మందివి వలంటీరే తన వేలిముద్రలను 20 సార్లు వేసి పింఛను రాకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని గత నెలలో ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లగా సచివాలయ సిబ్బందిని, వలంటీర్లను విచారించారు. గ్రామానికి చెందిన వలంటీరు ఒకరు మిగిలిన వలంటీర్ల బయోమెట్రిక్‌లను తీసుకుని రాత్రివేళల్లో టీడీపీ మద్దతుదారుల ఐడీలకు తన వేలిముద్రలు పలుమార్లు వేసి పింఛను రాకుండా చేసినట్లు విచారణలో తేలింది. ఇటువంటి పనులు చేయవద్దని సదరు వలంటీర్‌కు చెప్పినప్పటికీ మరలా అదే పనిచేస్తున్నారు. అలాగే ఊర్లోనే ఉన్నప్పటికీ లేరని నమోదు చేసి పింఛను ఇవ్వడం లేదు. పలు గ్రామాలలో తాము చెప్పినట్లు చేయకపోతే పింఛను ఆపేస్తామని లబ్ధి దారులను వలంటీర్ల బెదిరిస్తున్నారు. నెలనెలా వచ్చే పింఛనుతో గడిపే మాకు కేవలం ఓటేయలేదన్న నెపంతో పింఛను ఆపడం ఎంతవరకు సమంజసమని అధికారులను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను గమనించి తమకు రావాల్సిన పింఛను ఇప్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T03:40:13+05:30 IST