ఇకపై ఏ నెల పింఛన్‌ ఆ నెలలోనే తీసుకోవాలి.. లేదంటే..

ABN , First Publish Date - 2021-09-01T06:34:11+05:30 IST

సంక్షేమ పింఛన్‌దారులపై..

ఇకపై ఏ నెల పింఛన్‌ ఆ నెలలోనే తీసుకోవాలి.. లేదంటే..

పెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వం నిబంధన

పోర్టబిలిటీ కూడా రద్దు

ఎక్కడ పింఛన్‌ ఉంటే... అక్కడ మాత్రమే తీసుకోవాలి

ఈ నిబంధనలతో జిల్లాలో పది శాతం వరకూ పింఛన్‌ నగదు

ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉందని అంచనా

పెన్షన్‌దారుల వివరాలు వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘‘సెప్టెంబరు నుంచి ఏ నెల పింఛన్‌ ఆ నెలలోనే తీసుకోవాలి. ఆ మొత్తం మరుసటి నెలలో ఇవ్వరు. అంటే...అక్టోబరులో సెప్టెంబరు నెలకు సంబంధించిన పింఛన్‌ ఇవ్వరు. అలాగే ఒక ప్రాంతంలో వ్యక్తి మరో ప్రాంతంలో పింఛన్‌ తీసుకోవడం (పోర్టబిలిటీ) కూడా ఇకపై కుదరదు. ఏ ఊరిలో పింఛన్‌ తీసుకునే వ్యక్తి అదే ఊరిలో వేలిముద్ర వేయాలి. అప్పుడే వలంటీర్‌ పింఛన్‌ సొమ్ము అందజేస్తారు. ఈ విషయాన్ని ప్రతి పింఛన్‌దారుడు గుర్తుపెట్టుకోండి. సెల్‌ఫోన్‌ లేని వ్యక్తులకు సమాచారం అందించండి.’’

- పింఛన్‌దారులకు నగరంలోని ఒక వార్డు వలంటీర్‌ ఫోన్‌ సందేశం


సంక్షేమ పింఛన్‌దారులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సెప్టెంబరు ఒకటి నుంచి ఏ నెల పింఛన్‌...ఆ నెలలోనే తీసుకోవాలని స్పష్టంచేసింది. ఆ తరువాత నెలలో...ముందు నెల పింఛన్‌ మొత్తం ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఇంకా పింఛన్‌దారుల వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఎ)కు కాకుండా... నేరుగా గ్రామ/ వార్డు సచివాలయాలకు పంపి కొత్త సంప్రదాయానికి తెరతీసింది. అలాగే వైఎస్సార్‌ కానుక వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా పింఛన్ల వివరాలను తొలగించింది. 


వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా పింఛన్లు బట్వాడా చేస్తోంది. ఇప్పటివరకు ఒకటి, రెండు నెలలు పింఛన్‌ తీసుకోకపోయినా మూడో నెలలో తీసుకునే వెసులుబాటు ఉండేది. దీనికితోడు రాష్ట్రంలో ఎక్కడైనా పింఛన్‌ తీసుకునే అవకాశం (పోర్టబిలిటీ) ఉండేది. దీంతో ఎవరికీ ఇబ్బందులు ఉండేవి కావు. సాధారణంగా పింఛన్లు తీసుకునే వారిలో వృద్ధులు తమ కుటుంబ సభ్యులు, బంధువుల వద్దకు వెళుతుంటారు. అటువంటివారు ఒక నెలలో పింఛన్‌ తీసుకోకపోయినా ఆ మరుసటి నెలలో తీసుకునే అవకాశం ఉండేది. అలాగే వలస కార్మికుల కుటుంబాల్లో వృద్ధులు, వితంతువులు పనుల కోసం వెళ్లినచోట పింఛన్‌ తీసుకునే అవకాశం కల్పించారు. అయితే  పింఛన్‌ బట్వాడాలో మార్పులు చేస్తూ సోమవారం జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది.


సచివాలయ సిబ్బంది ఈ విషయాన్ని వలంటీర్లకు చెప్పడంతో వారంతా అప్రమత్తమై పింఛన్‌దారులకు సమాచారం ఇచ్చే పనిలో పడ్డారు. సాధారణంగా ప్రతి నెలా 10 నుంచి 15 శాతం మంది అదే నెలలో పింఛన్‌ తీసుకోరు. ఆ తరువాత నెల లేదా మూడో నెలలో తీసుకుంటుంటారు. అయితే ఏ నెల పింఛన్‌ను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధన విధించడంతో ఆ మేరకు సొమ్ము ప్రభుత్వానికి మిగిలే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. తాజా నిర్ణయంతో పింఛన్‌దారులు ఎక్కడున్నా ప్రతి నెలా ఒకటో తేదీకి స్వగ్రామానికి రావల్సిన పరిస్థితి నెలకొంది. 


కొత్త పింఛన్లు లేవు..

గత నెల (జూలై) జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 4,76,681 మందికి రూ.117.13 కోట్లు మంజూరుచేశారు. ఇలా ప్రతి నెలకు సంబంధించి వివరాలు డీఆర్‌డీఏకు వచ్చేవి. కానీ ఆగస్టు నెలకు సంబంధించి జిల్లాలో ఎంతమందికి పింఛన్‌ పంపిణీ చేయబోతున్నారనే సమాచారం డీఆర్‌డీఏకు ఇవ్వలేదు. నేరుగా సచివాలయాలకు పంపారు. అందువల్ల ఎన్ని పింఛన్లు వచ్చాయి?, ఎంతమందికి నిలిచిపోయాయి?...అనేది సచివాలయంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కాగా గడచిన నాలుగు నెలల నుంచి కొత్త పింఛన్లు మంజూరుచేయడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా ప్రతినెలా ఎదురుచూస్తున్నారు. 


Updated Date - 2021-09-01T06:34:11+05:30 IST