తైవాన్ సమీపంలో చైనా సైనిక కార్యకలాపాల పెరుగుదలపై పెంటగాన్ ఆందోళన

ABN , First Publish Date - 2021-06-17T16:12:07+05:30 IST

తైవాన్ గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాలు

తైవాన్ సమీపంలో చైనా సైనిక కార్యకలాపాల పెరుగుదలపై పెంటగాన్ ఆందోళన

వాషింగ్టన్ : తైవాన్ గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాలు చొచ్చుకెళ్ళడంపై పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిరతకు విఘాతం కలిగించే చర్యగా ఈ చొరబాటును అభివర్ణించింది. తైవాన్ దీవి సమీపంలో పెరుగుతున్న చైనా సైనిక కార్యకలాపాలు తప్పుడు నిర్ణయాల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. 


తమ గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతంలోకి 28 చైనా మిలిటరీ విమానాలు చొచ్చుకొచ్చాయని తైవాన్ మంగళవారం తెలిపింది. దీనిపై జపాన్ పత్రికకతో పెంటగాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, తైవాన్ సమీపంలో చైనా మిలిటరీ కార్యకలాపాలు పెరగడం అస్థిరపరిచే చర్య అని తెలిపారు. దీనివల్ల తప్పుడు నిర్ణయాల ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. 


తైవాన్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం, ఈ దీవి సమీపంలోకి చైనా మిలిటరీ విమానాలు ప్రతి రోజూ వెళ్తున్నాయి. మంగళవారం అత్యధికంగా 28 చైనా మిలిటరీ విమానాలు వెళ్ళాయి. వీటిలో ఫైటర్ జెట్స్, యాంటీ సబ్‌మెరైన్, ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, బాంబర్లు ఉన్నాయి.  ఏప్రిల్ 12న 25 మిలిటరీ విమానాలు ఈ ప్రాంతంలోకి వెళ్ళాయి. 


తైవాన్ స్వయంపాలిత దీవి. అయితే దీనిపై సంపూర్ణ సార్వభౌమాధికారం తమకే ఉందని చైనా చెప్తోంది. మెయిన్‌ల్యాండ్ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఈ దీవిలో 24 మిలియన్ల మంది నివసిస్తున్నారు. 


జీ7 దేశాధినేతలు ఆదివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. తైవాన్‌ స్ట్రెయిట్‌లో శాంతి, సుస్థిరతలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఆ తర్వాతే తైవాన్ సమీపంలో తన సైనిక కార్యకలాపాలను చైనా మరింత పెంచింది.

 

Updated Date - 2021-06-17T16:12:07+05:30 IST