తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామా... విజయశాంతి

ABN , First Publish Date - 2021-12-09T00:46:38+05:30 IST

తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామా... విజయశాంతి

తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామా... విజయశాంతి

హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. పూటుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల జీవితాలు నాశనమైపోతుంటే అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోందని ఆమె మండిపడ్డారు. తాజాగా బంజారాహిల్స్‌, నార్సింగి, గండిపేట్, మాదాపూర్‌లలో చోటు చేసుకున్న సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు కారణమైన వ్యక్తులందరూ మద్యం సేవించినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. గత కొన్నేళ్లలో డ్రంకెన్ డ్రైవర్ల కారణంగా ఇంకెన్నో పచ్చని కుటుంబాలు కుప్పకూలిపోయాయని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రాములమ్మ పోస్టు యథాతథంగా...





''తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో... లేదో... అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారింది. పూటుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల జీవితాలు నాశనమైపోతుంటే అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోంది తప్ప, ఇలాంటి ఘోరాలను నివారించే చర్యలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడం లేదు.  తాజాగా బంజారాహిల్స్‌, నార్సింగి, గండిపేట్, మాదాపూర్‌లలో  చోటు చేసుకున్న సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.... పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలకు కారణమైన వ్యక్తులందరూ మద్యం సేవించినట్లు తనిఖీల్లో తేలింది. గత కొన్నేళ్లలో డ్రంకెన్ డ్రైవర్ల కారణంగా ఇంకెన్నో పచ్చని కుటుంబాలు కుప్పకూలిపోయాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు మాత్రం ఒక నాలుగైదు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో వరుస పెట్టి చెకింగులు, కౌన్సిలింగులు పెట్టి క్రమంగా నీరుగార్చేయడం మామూలైపోయింది. దాంతో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే... బంజారాహిల్స్ ఘటనలో నిందితుడిని కాపాడేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిన సమాచారాన్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. దాదాపు 5 ఏళ్ళ కిందట ఇలాంటి ఘటనకే బలైపోయిన చిన్నారి రమ్య ఉదంతంలో విచారణే ముందుగు సాగడం లేదంటూ ఆ కుటుంబం నేటికీ ఆవేదన చెందుతున్న దుస్థితి దాపురించింది. గతేడాది కాలంలో ఇలా మందుబాబుల క్రౌర్యానికి దాదాపు 800 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిందితులు అరెస్టయినా కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయట తిరుగుతుండటం బాధిత కుటుంబాల్లో వేదన రెట్టింపు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు విషయంలో రవాణాశాఖ తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లపై చర్యలు ఇంకెంత గొప్పగా ఉన్నాయనేది చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్ విశ్వనగరమని... ఏదేదో చేసేస్తామని... గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన పనిలేదు.'' అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2021-12-09T00:46:38+05:30 IST