సడలింపు వేళ గుంపులుగా ప్రజలు

ABN , First Publish Date - 2021-05-19T07:44:15+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు.

సడలింపు వేళ గుంపులుగా ప్రజలు
దర్శి బస్టాండ్‌లో గుంపులుగా తిరుగుతున్న ప్రజలు

విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా

దర్శి, మే 18 : లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు. షాపుల వద్ద, పండ్ల దుఖాణాల వద్ద కొనుగోళ్లు సమయంలో గుంపులుగా చేరుతున్నారు. ఆ సమయంలో అధికారులు పర్యవేక్షణ లేకపోవటంతో ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సామాజికదూరం పాటించకపోవటంతో పాటు అనేకమంది మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో కరోనా దర్శిలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. 

దర్శిలో ఇప్పటికే 300 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా రెట్టింపు ఉన్నాయి. సుమారు 20 మందికి పైగా మృతిచెందారు. మహమ్మారి ప్రజల ప్రాణాలు అధికసంఖ్యలో బలికొంటున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై ప్రజలు తిరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నా సడలింపు సమయంలో పట్టించుకోవటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా మరింత ఉధృతమయ్యే ప్రమాదం నెలకొంది. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు సామాజికదూరం పాటించటంతో పాటు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-19T07:44:15+05:30 IST