పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదం

ABN , First Publish Date - 2022-05-06T06:42:05+05:30 IST

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదముంది. ఆయన యాత్రను ఎక్కడకు వెళ్లినా ఆదరిస్తున్నారు.

పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదం
బహిరంగ సభలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

 బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

 ప్రజలు మార్పు కోరే విషయం స్పష్టమవుతోంది

 పాలమూరుకు బీజేపీ రుణపడి ఉంది - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 పాలమూరు మంత్రీ... నీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు - బండి సంజయ్‌

మహబూబ్‌నగర్‌, మే 5 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదముంది. ఆయన యాత్రను ఎక్కడకు వెళ్లినా ఆదరిస్తున్నారు. ప్రజలు మార్పుకోరుకుంటున్న విషయం ఈయాత్రతో స్పష్ట మవుతోంది. ఈ సభలో జోష్‌ చూస్తే తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రాబోతోందనే విశ్వాసం కలుగుతోంది.’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్‌నడ్డా అన్నారు. బీజేపీ రెండోదశ ప్రజాసంగ్రామయాత్ర 22వరోజు మహబూబ్‌నగర్‌కు చేరుకున్న సందర్భంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిలసాగర్‌ పథకాలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్‌ఇంజన్‌ సర్కార్‌ వస్తే పేదల కోసం మోదీ అమలు చేస్తోన్న అన్ని పథకాలు ఇక్కడ కూడా అమలవుతాయని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరుకు బీజేపీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరుకు, బీజేపీకి అవినాభావసంబంధముందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించి ఆదరించారని వివరించారు. రాబోయే రోజుల్లోనూ ఈ ప్రాంతంలో బీజేపీని ఆదిరిస్తారనే విశ్వాసముందన్నారు. బండి సంజయ్‌ పాలమూరులో నిర్వహిస్తోన్న ప్రజాసంగ్రామయాత్రను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ పాలమూరులో బీజేపీకి ఆదరణ ఉంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ   పాలమూరు మంత్రి.. ఇంకొక్క సంవత్సరమే నీ ఆటల సాగుతాయి. నీ చరిత్ర తెలుసు. మేం నోరు తెరిస్తే నీ బతుకు ఛీకొడతారన్న విషయం గుర్తుంచుకోవాలి. పేదల ఇల్లు ఎవరి పేరున ఉంటుందో గ్యారంటీ లేదు. ఉదయం మన పేరున ఉన్న ఇల్లు సాయంత్రం మంత్రి కబ్జాలోకి పోతుంది. పోలీసులు, అధికారులు, విపక్షనాయకులను, బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తడు. చంపుతాని బెదిరిస్తడు. లేకపోతే చంపుతున్నారని కేసులు పెడతాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అడ్డగోలుగా భూకబ్జాలు, ఇసుక, మట్టి దందాలు చేసి గుంటనక్కలా, దున్నపోతులా కోట్ల రూపాయలు సంపాదించి ఈగడ్డకు అన్యాయం చేస్తున్నారని, అన్యాయం చేసినవారెవరూ బాగుపడలేదని అన్నారు. మంత్రి అయ్యాక నీవు రౌడీయిజం చేస్తున్నావని, బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లతో, ఉగ్రవాదులతో కొట్లాడారని, మేం కూడా పేదలకోసం, బడుగుబలహీనవర్గాల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం రౌడీయిజం చేస్తామని అన్నారు. నీవు ఇప్పుడు రౌడీయిజం చేస్తే, తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని అన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమని, పోలీసు అధికారులకు చెబుతున్నానని, రేపో, ఎల్లుండో పోయేపార్టీ టీఆర్‌ఎస్‌పార్టీ అని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వముందని, తెలంగాణలో ఎప్పుడు ప్రభుత్వమేర్పడిన ఈ మంత్రి ఏదేశంలో ఉన్నా, ఏబొక్కలో ఉన్నా గుంజుకొచ్చి పేదల ఆస్తులను తిరిగి స్వాఽధీనం చేసుకొంటామని, పేదలకు తప్పకుండా ఇస్తామని, ఎవరూభయపడాల్సిన అవసరంలేదని అన్నారు. పాలమూరుపై సీఎం కేసీఆర్‌ కక్షకట్టారని, ఈప్రాంతానికి తీరని అన్యాయం చేశారని, వలసలు లేవని అబద్ధాలాడుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి ఇక్కడ సేవచేసే అవకాశం కల్పిస్తే పాలమూరును పచ్చగా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. 

  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం 

బండి సంజయ్‌ చేపట్టిన రెండోదశ ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావడంపై బీజేపీ నేతలు, శ్రేణుల్లో ఆనందం వ్యక్తమయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సభకు జనం తరలిరావడంపై పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవికాలం కావడం, ఎండ ఎక్కువగగా ఉండడంతో తొలుత జనం ఎంతమేర వస్తారోననే సందేహం ఉన్నప్పటికీ సాయంత్రానికి గ్రౌండ్‌ నిండిపోవడంపై పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. సభకు వచ్చిన  జాతీయ అఽఽధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలతో పాటు బండిసంజయ్‌ , డీకేఅరుణ, జితేందర్‌రెడ్డి ప్రసంగాలకు సభలో చప్పట్లు మోగాయి. సభకు వచ్చిన జేపీనడ్డా, తరుణ్‌ఛుగ్‌, కిషన్‌రెడ్డి, డీకేఅరుణ తదితర నేతలు పదాదికారుల సమావేశమనంతరం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తేనీరు సేవించగా, సభ ముగిశాక డీకే అరుణ ఇంట్లో విందు చేశారు. సమయం తక్కువగా ఉండడంతో తరుణ్‌ఛుగ్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, ఈటెల రాజేందర్‌ , రాజాసింగ్‌ తదితర నేతలు మాట్లాడలేకపోయారు.  







Read more