సాధారణ జీవితాల్లోకి జనం

ABN , First Publish Date - 2022-06-17T06:19:40+05:30 IST

రెండేళ్లుగా కరోనా సృష్టించిన విషాదాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మరిచి సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు.

సాధారణ జీవితాల్లోకి జనం

-  వంద రోజులుగా నమోదు కాని కరోనా కేసులు 

- మహారాష్ట్ర, విదేశాల్లో పెరుగుతున్న పాజిటివ్‌లు

- ప్రారంభమైన పాఠశాలలు

- విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రెండేళ్లుగా కరోనా సృష్టించిన విషాదాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మరిచి సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌, మహారాష్ట్ర, విదేశాల్లో కేసులు పెరుగుతుండడం జిల్లా వాసులను మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో వంద రోజులుగా ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కొవిడ్‌ టీకాలు తీసుకోవడం, కేసుల నమోదు లేకపోవడంతో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం లేదు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంతో పాటు దేశ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. రెండేళ్లుగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు జరగక ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితమయ్యారు. గత సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవుల అనంతరం ఇటీవల పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇతర ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు నమోదు అవుతుండడంతో జిల్లాలో పరిస్థితులు ఏలా ఉంటాయోననే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- జిల్లాకు రాకపోకలు ఎక్కువగానే.. 

రాజన్న సిరిసిల్లకు చెందిన వారు వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉపాధి, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వెళ్లిన వారు ఉన్నారు. నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఎక్కడా కొత్త వేరియేంట్‌ వచ్చినా జిల్లాలో వెలుగు చూస్తుంటాయి. ఒమైక్రాన్‌ వంటి వేరియేంట్‌ కేసులు కూడా మొదలైన వెంటనే జిల్లాలో వెలుగు చూశాయి. ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్న క్రమంలో జిల్లాలో కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే ఆందోళన నెలకొంది. దాదాపు రెండేళ్లుకుపైగా కరోనాతో జిల్లా ప్రజలు అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 2020 మార్చిలో మొదలైన కరోనా  జిల్లాలో అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మొదటి వేవ్‌ను మించి రెండో వేవ్‌ ఉధృతిని చూపింది. థర్డ్‌వేవ్‌ మాత్రం అందరిని టచ్‌ చేసి వెళ్లింది. నాలుగో వేవ్‌ ఉంటుందా అనే సందిగ్ధం వెంటాడుతోంది.  జిల్లాలో గడిచిన వంద రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జిల్లాలో తొలి కేసు వేములవాడలో నమోదైన నాటి నుంచి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ, కట్టడీలు, కొవిడ్‌ నిబంధనల మధ్య ప్రజలు భయంభయంగా గడిపారు. సరిగ్గా రెండేళ్ల తరువాత ఇప్పుడు మాస్క్‌ ధరించకుండా భౌతికదూరం వంటి పాటించుకుండానే సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇతర శాఖల అధికారుల అప్రమత్తతో ప్రస్థుతం కొవిడ్‌ కేసులు నమోదు కావడం లేదు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి స్వచ్ఛందంగా గ్రామాలు కట్టడి పాటించాయి. ఒక కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వస్తే మిగతా కుటుంబ సభ్యులతో పాటు ప్రైమరీ కాంటాక్ట్‌ వారికి కూడా పరీక్షలు జరిపారు. హోం క్వారంటైన్‌, ప్రభుత్వ అసుపత్రుల్లో ప్రత్యేక కొవిడ్‌ వార్డుల్లో  చికిత్సలు అందించారు. సిరిసిల్ల, వేములవాడ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లిక్విడ్‌ ట్యాంకర్లు, బల్క్‌ సిలెండర్లు, కాన్సెట్రేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్స్‌ను ఏర్పాటు చేసి చికిత్సలను అందించారు. కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాల్లో బలవర్ధకమైన ఆహారం కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించి అందించారు. మరోవైపు వ్యాధి నిరోధకానికి ప్రజలు అనేక చర్యలు చేపట్టిన క్రమంలోనే వ్యాక్సినేషన్‌తో కొవిడ్‌ కట్టడి సుగమమైందని చెప్పవచ్చు. 

- రెండేళ్లలో 36,270 మంది బాధితులు 

జిల్లాలో రెండేళ్ల కాలంలో 6,92,867 మందికి పరీక్షలు చేయగా 36,270 మంది  కొవిడ్‌ బారిన పడ్డారు. 672 మంది మృతి చెందారు. మొదటి వేవ్‌లో 13,380 మంది కొవిడ్‌ బారిన పడగా 165 మంది మృతిచెందారు. రెండోవేవ్‌లో 19,040 మంది కొవిడ్‌బారిన పడగా 475 మంది మృతిచెందారు. థర్డ్‌వేవ్‌లో 3,850 మంది కొవిడ్‌బారిన పడగా 32 మంది మృతిచెందారు. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉన్నారు. థర్డ్‌వేవ్‌లో మరణాలు లేకపోవడంతో పాటు కొవిడ్‌ సోకిన వారు సైతం దగ్గు, జలుబు, గొంతునొప్పి, సాధారణ జ్వరాలతోనే బాధపడ్డారు. థర్డ్‌వేవ్‌లో అందరిని టచ్‌ చేసి వెళ్లింది. ఫీవర్‌ సర్వేతో థర్డ్‌వేవ్‌ పూర్తిగా కట్టడిగా మారింది. 

-  ఆరోగ్య సిబ్బంది... స్వచ్ఛంద సంస్థల సేవలు.. 

జిల్లాలో కొవిడ్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించడంతో రోజు వారీ కూలీలు, నేత కార్మిక కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడ్డాయి. లాక్‌డౌన్‌ సమయంలో సిరిసిల్ల మున్సిపల్‌తో పాటు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా నిలిచారు. కొవిడ్‌ బారినపడి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి సైతం భోజనాన్ని అందించారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు సైతం ముందుకు రాని పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ వ్యాపార సంస్థలు మూసివేయడంతో నష్టాలను చవిచూశారు. విద్యార్థుల చదువులపై కూడా ప్రభావం పడింది. రెండేళ్ల పాటు అతలాకూతలమైన జనం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ మళ్లీ యథావిధిగా, ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 


Updated Date - 2022-06-17T06:19:40+05:30 IST