ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారికి కోవిడ్ ముప్పు తక్కువ: అధ్యయనం

ABN , First Publish Date - 2020-06-02T00:39:42+05:30 IST

సముద్ర మట్టానికి మూడువేల మీటర్లు (9,842 అడుగుల), ఆ పైన ఎత్తున ప్రదేశాల్లో నివసించే వారికి కోవిడ్-19

ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారికి కోవిడ్ ముప్పు తక్కువ: అధ్యయనం

న్యూఢిల్లీ: సముద్ర మట్టానికి మూడువేల మీటర్లు (9,842 అడుగులు), ఆ పైన ఎత్తున్న ప్రదేశాల్లో నివసించే వారికి కోవిడ్-19 ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో వెల్లడైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారితో పోలిస్తే వీరిలో వైరస్ సంక్రమించే ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. రెస్పిరేటరీ ఫిజియాలజీ, న్యూరో బయాలజీ జర్నల్‌లో ప్రచురించిన పీర్-రివ్యూడ్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ‘వాషింగ్టన్ పోస్ట్’ ఈ విషయాన్ని తెలిపింది. బొలీవియా, ఈక్వెడార్, టిబెట్ నుంచి వచ్చిన ఎపిడెమియోలాజికల్ డేటాను విశ్లేషించిన ఆస్ట్రేలియా, బొలీవియా, కెనడా, స్విట్జర్లాండ్ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. చైనా కంటే, బొలీవియన్ అండీస్, మిగతా దేశాల కంటే టిబెట్‌లో సంక్రమణ రేటు మూడు రెట్లు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే, ఈక్వెడోరన్ అండీస్ కంటే వైరస్ సంక్రమణ రేటు నాలుగు రెట్లు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.

 

 సుందరమైన ఆండియన్ లోయ అయిన పెరులోని కుస్కో నగరంలో 4,20,000 మంది నివసిస్తున్నారు. అత్యంత ఎత్తులో ఉన్న ఈ నగరంలో మెక్సికో, చైనా, బ్రిటన్ నుంచి వచ్చిన ముగ్గురు పర్యాటకులు మార్చి 23-ఏప్రిల్ 3 మధ్య మరణించారు. దీంతో పెరు దేశవ్యాప్తంగా అత్యంత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసింది. దేశవ్యాప్తంగా 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ కుస్కోలో మాత్రం ఆ తర్వాత ఒక్క మరణం కూడా సంభవించలేదు. దేశంలో 1,41,000 కేసులు నమోదు కాగా, కుస్కో ప్రాంతంలో మాత్రం 916 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే మరికొన్ని ఎత్తైన ప్రదేశాల్లోని నగరాల్లో గుర్తించారు. దీనిని బట్టే అధ్యయనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. 

Updated Date - 2020-06-02T00:39:42+05:30 IST