ప్రజలు నన్ను అందుకే ప్రధాన మంత్రిని చేశారు : మోదీ

ABN , First Publish Date - 2021-12-12T19:15:41+05:30 IST

బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాలని తాను ముఖ్యమంత్రిగా

ప్రజలు నన్ను అందుకే ప్రధాన మంత్రిని చేశారు : మోదీ

న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాలని తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవాడినని, కానీ ఫలితం లేకపోయిందని, ఆ పని చేయడం కోసమే తనను ప్రజలు ప్రధాన మంత్రిని చేశారని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘డిపాజిటర్లకే పెద్ద పీట : రూ.5 లక్షల వరకు నిర్ణీత కాల వ్యవధిలో డిపాజిట్ బీమా చెల్లింపు హామీ’’పై కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. 


సమస్యలను తివాచీ క్రిందకు విసిరేసే ధోరణి అనేక సంవత్సరాలపాటు ఉండేదని చెప్పారు. నేటి నవ భారతం సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించిందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం, జాప్యం చేయడం లేదన్నారు. గతంలో బ్యాంకుల నుంచి డిపాజిట్ సొమ్మును పొందలేకపోయిన డిపాజిటర్లకు సింబాలిక్ చెక్కులను ఈ సందర్భంగా  అందజేశారు. 


కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా దాదాపు 98 శాతం డిపాజిట్ ఖాతాలు లబ్ధి పొందుతాయన్నారు. దీనివల్ల బ్యాంకుల పట్ల భారతీయులకు నమ్మకం పెరుగుతుందన్నారు. తమ డిపాజిటర్లకు సొమ్మును చెల్లించడంలో 17 బ్యాంకులు విఫలమయ్యాయని తెలిపారు. బీమా కవరేజిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు చెప్పారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ క్రింద సమయాన్ని 8-9 సంవత్సరాల నుంచి 90 రోజులకు తగ్గించామని తెలిపారు. 


భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం యావత్తు కలిసికట్టుగా పని చేయగలమని నిరూపించిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థూల చోదక శక్తిగా వాస్తవంగా మారగలిగే సమయం భారత దేశానికి వచ్చిందని తెలిపారు. 


డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం పరిధిలోకి పొదుపు, ఫిక్స్‌డ్, కరంట్, రికరింగ్ డిపాజిట్లు వస్తాయి. భారత దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు, రాష్ట్ర, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకులలో సొమ్ము దాచుకున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఒక బ్యాంకులో ఒక డిపాజిటర్‌కు రూ.5 లక్షల చొప్పున బీమా కవరేజ్ లభిస్తుంది. 


Updated Date - 2021-12-12T19:15:41+05:30 IST