‘భయపడాల్సిన అవసరం లేదు.. హై రిస్క్‌ జోన్లు ఏమీ లేవు’

ABN , First Publish Date - 2020-03-26T09:18:22+05:30 IST

విశాఖపట్నంలో కరోనా వైరస్‌ హై రిస్క్‌ జోన్లు..

‘భయపడాల్సిన అవసరం లేదు.. హై రిస్క్‌ జోన్లు ఏమీ లేవు’

పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

బజార్లకు కూరగాయలు తెచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తాం


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కరోనా వైరస్‌ హై రిస్క్‌ జోన్లు ఏమీ లేవని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం ఉదయం జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ కాళేశ్వరావుతో కలిసి సీతమ్మధార రైతుబజార్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో సీతమ్మధార, గాజువాక, ఎండాడ తదితరాలు హైరిస్క్‌ ప్రాంతాలని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని, ప్రజలు భయపడవద్దని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని మండలాల వారీగా విభజించినప్పుడు విశాఖపట్నం అర్బన్‌ మండలంలో 649 మంది, గాజువాక మండలంలో 476 మంది, విశాఖ రూరల్‌ మండలంలో 245 మంది వున్నట్టు లెక్క తేలిందన్నారు.


విశాఖ అర్బన్‌ మండల కేంద్రం సీతమ్మధార కావడం, గాజువాక మండల కేంద్రం గాజువాక, విశాఖ రూరల్‌ మండల కేంద్రం ఎండాడ కావడంతో అంతా అక్కడే వున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయా మండలాల్లో వేర్వేరు చోట్ల విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. విశాఖ అర్బన్‌ మండలంలో అందరి ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వివరాలు సేకరించామన్నారు. ఎవరికీ కరోనా లక్షణాలు లేవని స్పష్టంచేశారు.


వారిలో 350 మందికి ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్‌ పీరియడ్‌ పూర్తయిందని, మిగిలినవారు కూడా ఆ సమయం పూర్తయ్యేంత వరకు ఇళ్లలోనే వుండాలని చెప్పామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఇంట్లో వుండకుండా బయట తిరుగుతుంటే...కంట్రోల్‌ రూమ్‌ నంబరుకు, లేదంటే పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి చెబితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


రైతులకు అన్ని వసతులు సమకూరుస్తాం

బజార్లకు కూరగాయలు తీసుకువచ్చే రైతులకు అన్ని రకాల వసతులు సమకూరుస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. సీతమ్మధార రైతుబజార్‌ను సందర్శించి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూరగాయలు తెచ్చి, అమ్ముతుండగా, కర్ఫ్యూ వల్ల వాహనాలు దొరకడం లేదని, ఏదైనా ఆటోలో వస్తుంటే.. దానిని కూడా ఆపేస్తున్నారని వారు వివరించారు. ఇంతకు ముందు ఆర్టీసీ బస్సులు నడిపేదని, ఇప్పుడు వాటిని కూడా నిలిపేశారని ఆరోపించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు.


Updated Date - 2020-03-26T09:18:22+05:30 IST