డెల్టా కూడా..!

ABN , First Publish Date - 2022-01-24T08:01:56+05:30 IST

ఆయన.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల కరోనా బారినపడ్డారు. 12 రోజులకు నెగెటివ్‌ వచ్చింది.

డెల్టా కూడా..!

  • ఒమైక్రానే అని ప్రజల్లో నిర్లక్ష్యం..
  • 2-3 రోజుల్లో తగ్గుతుందనే అభిప్రాయం
  • అంతర్లీనంగా ప్రమాదకర డెల్టా.. 
  • పాజిటివ్‌ల్లో కొందరికి సీరియస్‌
  • కేసులను పరిశీలిస్తుంటే స్పష్టం
  • అన్నీ కొత్త వేరియంట్‌వి కాదు
  • కొన్నిచోట్ల తిరగబెడుతున్న డెల్టా
  • ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలూ
  • అప్రమత్తంగా ఉండాలి: నిపుణులు
  • న్యు విశ్లేషణ నిలిపేసిన సర్కారు
  • అన్నీ ఒమైక్రాన్‌గా తేల్చేసి విస్మరణ
  • రాష్ట్రంలో కొత్తగా 3,603 కేసులు
  • ఆదమరవొద్దు.. అజాగ్రత్త వద్దు
  • 3వ రోజు 50 వేల మందిలో లక్షణాలు


హైదరాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆయన.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల కరోనా బారినపడ్డారు. 12 రోజులకు నెగెటివ్‌ వచ్చింది. తర్వాత పది రోజులపైగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. సాధారణంగా ఆయనకు సోకినది ఒమైక్రాన్‌ వేరియంట్‌ అయి ఉంటే.. ఈ స్థాయిలో ఇబ్బంది వచ్చేది కాదనేది వైద్య నిపుణుల మాట. దీన్నిబట్టి చూస్తే ఆ ఉద్యోగి డెల్టా బారినపడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్కరే కాదు.. ప్రస్తుతం చాలామంది ఇలా ప్రమాదకర డెల్టా వేరియంట్‌కు గురవుతున్నారనేది నిపుణుల అభిప్రాయం. కాగా, వ్యాప్తి రీత్యా వేగవంతమైన ఒమైక్రాన్‌ కారణంగా ప్రస్తుతం కేసులు ఎక్కువగా వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. దీంతో వచ్చేవన్నీ ఒమైక్రాన్‌ కేసులేనన్న ఆలోచనలో వైద్య శాఖ ఉంది. ఒమైక్రానా? లేక డెల్టానా? అన్నది తేల్చేందుకు జన్యు విశ్లేషణ చేయడం లేదు. ఇంకోవైపు కొత్త వేరియంట్‌తో ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు రావని, 2-3 రోజుల్లో కోలుకోవచ్చనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. అయితే, పరిస్థితులు మాత్రం అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఆస్పత్రుల్లో కరోనా రోగుల చేరికలు పెరుగుతున్నాయి. కొందరికి ఆరోగ్యం విషమిస్తోంది కూడా. ఇందుకు ప్రధాన కారణం డెల్టానే అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌  సహా రాష్ట్రంలో పలుచోట్ల ఇంకా డెల్టా వేరియంట్‌ తీవ్రత అలాగే ఉందని..అది తిరగబెడుతోందంటున్నారు. ఇక, పాజిటివ్‌ వచ్చినవారు చాలామంది వేరియంట్‌ నిర్ధారణ కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి జన్యు విశ్లేషణ చేయించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్య నమూనాల్లో డెల్టావేనని తేలుతోంది.


నెల క్రితం 1,200.. ఇప్పుడు 3,200 మంది

రాష్ట్రంలో నెల క్రితం ఆస్పత్రుల్లోని కొవిడ్‌ రోగులు 1,199. ప్రస్తుతం 3,207. ఇందులో ఆక్సిజన్‌పై 1,291 మంది, ఐసీయూలో 804 మంది ఉన్నారు. ఒమైక్రాన్‌తో ఆస్పత్రుల్లో చేరికలు ఉండవని వైద్యులంటున్నారు. ఆ వేరియంట్‌లోని వైరల్‌ లోడ్‌ గొంతులోనే ఉంటుందంటున్నారు. ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. డెల్టా మాత్రం వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టాతో.. అప్పట్లో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పైకి ఎక్కువమంది వెళ్లారు. మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ప్రస్తుతం అంతా ఒమైక్రాన్‌ అన్న ధోరణి ఉంది. సీరియస్‌ ఏమీ కావడం లేదన్న నిర్లక్ష్యం కనిపిస్తోంది. డెల్టా పొంచి ఉన్న పరిస్థితుల్లో ఈ తీరుతో ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్‌, ఐసీయూ పడకల కేసుల్లో డెల్టావే ఎక్కువని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒమైక్రానేలే అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని సూచిస్తున్నారు.


జన్యు విశ్లేషణ విస్మరణ

థర్డ్‌ వేవ్‌ కేసులన్నీ ఒమైక్రాన్‌వేనని తేల్చేసిన ప్రభుత్వం ఇకపై జన్యు విశ్లేషణ చేయబోమని 20 రోజుల కిందటే ప్రకటించింది. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో ఈ నెల మొదటి వారంలో కొన్ని నమూనాల విశ్లేషణలో 87 శాతం ఒమైక్రాన్‌ వేరియంట్‌, 13 శాతం డెల్టాగా తేల్చారు. అయితే, తర్వాత పరిస్థితి మారింది. ఆస్పత్రుల్లో చేరికలు పెరిగాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో జన్యు విశ్లేషణ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది నిరంతరం కొనసాగితేనే వేరియంట్‌ ఏదో తేలుతుంది. దాంతో అప్రమత్తం కావొచ్చు. అందుకనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. అంతా ఒమైక్రాన్‌ వేరియంటే అన్న ధోరణిలో ఉంటే, మళ్లీ డెల్టా విరుచుకుపడే ప్రమాదం ఉంది. 


మహారాష్ట్రలో ఇప్పటికీ డెల్టాదే ఆధిపత్యం

పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికీ డెల్టా వేరియంటే ఎక్కువగా ఉందని జన్యు విశ్లేషణ నివేదికలు చెబుతున్నాయి. థర్డ్‌ వేవ్‌లోనూ ఒమైక్రాన్‌ కంటే డెల్టా వ్యాప్తే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర వైద్య వర్గాలు వెల్లడించాయి. రోగుల్లో ఎక్కువ మంది డెల్టా బాధితులేనని స్పష్టం చేశాయి. నవంబరు 1 నుంచి 4,265 నమూనాల విశ్లేషణలో 68 శాతం డెల్టావేనని తేలింది. అంటే ఇప్పటికీ అక్కడ డెల్టా తీవ్రత ఉంది.


ఏపీలో కొత్త కేసులు 14,440

ఏపీలో గడిచిన 24 గంటల్లో 44,650 మందికి పరీక్షలు నిర్వహించగా 14,440 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 14,542కు పెరిగాయి. పాజిటివిటీ రేటు ఆదివారం 30.95 శాతం నమోదయింది. తాజాగా విశాఖపట్నంలో అత్యధికంగా 2,258 కేసులు వెలుగులోకి వచ్చాయి. 

Updated Date - 2022-01-24T08:01:56+05:30 IST