‘హద్దులు’ దాటుతున్న ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2021-08-01T06:13:00+05:30 IST

కలికిరి మండల పరిధిలోని బాహుదా నదిలో జేపీ వెంచర్స్‌ సంస్థ ఆధ్యర్యంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు నిబంధనలకు అతీతంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

‘హద్దులు’ దాటుతున్న ఇసుక తవ్వకాలు
బాహుదా నదిలో నీరు నిల్వ చేసేందుకు వేసిన అడ్డుకట్టను ఛిద్రం చేస్తున్న జేపీ సిబ్బంది

భూగర్భ జలాలకు ముప్పంటూ అడ్డుకుంటున్న జనం


కలికిరి, జూలై 31: కలికిరి మండల పరిధిలోని బాహుదా నదిలో జేపీ వెంచర్స్‌ సంస్థ ఆధ్యర్యంలో జరుతున్న ఇసుక తవ్వకాలు నియమాలకు అతీతంగా విచ్చల విడిగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాల్మీకిపురం మండలంలోని మాధవరంపల్లె రీచ్‌లో ఇసుక తవ్వకాలు జరపాల్సిన జేపీ వెంచర్స్‌ హద్దులు దాటి ఏకంగా కలికిరి మండలంలోని బాహుదా ప్రాజెక్టులోకి అడుగు పెట్టింది. పెద్దఎత్తున పొక్లయిన్లు, టిప్పర్లను మోహరించి ప్రాజెక్టులో నిల్వల్ని ఖాళీ చేయడానికి ప్రయత్నించింది. ప్రాజెక్టు నుంచి నీరు వృధా పోకుండా వేసిన అడ్డుకట్టలను పొక్లయినర్లతో ఛిద్రం చేశారు. పైపులను కూడా తొలగించారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు ఫిర్యాదు చేయడంతో కలికిరి పోలీసులు, రెవెన్యూ అధికారులు, మేడికుర్తి పంచాయతీ సిబ్బంది శనివారం రైతులతో కలిసి ప్రాజెక్టులో ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. మాధవరంపల్లె పంచాయతీ పరిధి దాటి కలికిరి మండలంలోని మేడికుర్తి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారంటూ ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టుతోపాటు ఆర్‌ అండ్‌ బీ బ్రిడ్జికి అటూ ఇటూ 500 మీటర్లు ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ 2018లో  సబ్‌ కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా రైతులు, అధికారులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక తవ్వకాలను ఆపేశారు. ఇంత విచ్చల విడిగా ఇసుక తరలిస్తే ఏరు ఎడారి అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


అద్దవారిపల్లెలో కొనసాగుతున్న అడ్డంకులు

ఇదిలా వుండగా అద్దవారిపల్లె రీచ్‌లో జేపీ వెంచర్స్‌ పేరుతో ఇసుక తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను స్థానికులు 20 రోజులుగా అడ్డుకుంటున్నారు. అయితే ఈ రీచ్‌లో జేపీ సంస్థ ప్రతినిధులెవరూ లేకున్నా కుప్పం నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాయకుడికి చెందిన దాదాపు 20 టిప్పర్లు, పొక్లైనర్లు 20 రోజులుగా తవ్వకాల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కుప్పం నాయకుడు అద్దవారిపల్లె పరిసరాల నాయకులతో జరుపుతున్న మంతనాలు కొలిక్కి రాకపోవడంతో తవ్వకాలు ప్రారంభం కాలేదు. ఇక్కడికి సమీపంలోని చీకటిపల్లె, మాధవరంపల్లె రీచుల్లో జేపీ సంస్థ ప్రతినిధులు తవ్వకాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే అద్దవారిపల్లె రీచ్‌కు జేపీ ప్రతినిధులెవరూ రాకపోవడం, కుప్పం నాయకుడు తవ్వకాలకు నడుం బిగించడంతో అక్రమ తవ్వకాలకు తెర తీస్తున్నారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బాహుదా నది మొత్తానికి ఇక్కడ నాణ్యమైన ఇసుక నిల్వలు అపారంగా వుండడంతో కుప్పం వైసీపీ నాయకుడి కన్నుపడిందని చెబుతున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతలే ఈ నాయకుడిని అడ్డుకుంటున్నారు. ఈ నాయకులు అంగీకరిస్తే తప్ప కుప్పం నాయకుడు ముందుకెళ్ళే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే ఏదో విధంగా తవ్వకాలను ప్రారంభించేందుకు కుప్పం నాయకుడు ఇరవై రోజులుగా స్థానికంగానే మకాం వేయడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-08-01T06:13:00+05:30 IST