టీకావైపు జనం

ABN , First Publish Date - 2021-04-10T06:39:30+05:30 IST

సెకండ్‌వేవ్‌ కరోనావేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనం కొవి డ్‌ వ్యాక్సిన్‌ వైపు పరుగులు తీస్తున్నారు.

టీకావైపు జనం
ముథోల్‌ మండలం ఎడ్‌బిడ్‌ గ్రామంలోన గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం వాక్సినేషన్‌ శిబిరానికి హాజరైన ప్రజలు

కో వ్యాక్సిన్‌ కోసం భారీగా డిమాండ్‌ 

ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్న జనం 

కరోనా టెస్టులదీ అదే పరిస్థితి 

పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య 

కనీస జాగ్రత్తల విస్మరణ 

అప్రమత్తమవుతున్న అధికారులు

నిర్మల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : సెకండ్‌వేవ్‌ కరోనావేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనం కొవి డ్‌ వ్యాక్సిన్‌ వైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు రాంనగర్‌ అర్బన్‌ ఆసు పత్రి, భైంసా, ఖానాపూర్‌లలో టీకాను తీసుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. దీంతో పాటు స్వల్ప లక్షణాలున్న వారంతా కొవిడ్‌ టెస్టులను కూడా పోటా పోటీగా చేయించుకుంటున్నారు. గతానికి భిన్నంగా టెస్టులు చేసుకునే వారి సంఖ్యక్రమంగా పెరుగుతోంది. స్వల్పలక్షణాలున్న వారంతా ఆసుప్రతులకు చేరుకొని కరోనాపరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం జనం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కొంతమంది మాస్క్‌లు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తున్నప్పటికీ చాలా మంది ఈ జాగ్రత్తలను విస్మరించి వ్యవహరిస్తుండడం వైరస్‌వ్యాప్తికి దోహదపడుతోందంటున్నారు. ఇదిలా ఉండగా టీకాలవైపు కూడా జనందృష్టి సారిస్తుండడంతో రోజురోజుకూ వాటిని తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కొవిషీల్డ్‌ టీకాను ఇస్తుండగా రాంనగర్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ కొవ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది కొవ్యాక్సిన్‌ టీకాకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది లా ఉండగా జిల్లా యంత్రాంగం కరోనావ్యాప్తి కట్టడికి పకడ్భందీ కార్యాచరణ చేపడుతోంది. ప్రతిరోజూ నాలుగైదు గంటల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిపోతున్న నేపథ్యం లో జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి అప్రమత్త చర్యలకు ఆదేశిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఓ వైపు కరోనాపరీక్షలు, వ్యాక్సినేషన్‌లో బిజీ, పంచాయతీ, మున్సిపాలిటీలు పారిశుధ్యంపై దృష్టి పెడుతున్నాయి. అలాగే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో అవగాహన చర్యలను చేపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని మంచి ర్యాల చౌరస్తాలో మైకుల ద్వారా చేపడుతున్న ప్రచారం ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అలాగే సానిటైజర్‌లను ఉపయోగించాలని, గుంపులు గుంపులుగా జనం తిరగవద్దంటూ ఆ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రతీరోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్యను సమీక్షిస్తూ కరోనావ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరగాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. 

కొవ్యాక్సిన్‌కే ప్రాధాన్యత

కరోనా విషయంలో టీకాలకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ టీకాలు అందుబాటులో ఉండగా కో వ్యాక్సిన్‌ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కొవ్యాక్సిన్‌ ఇచ్చే ఆసుపత్రులకు ఎక్కువ సంఖ్యలో జనం వెళుతున్నారు. కొవ్యాక్సిన్‌ కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండడంతో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ పీహెచ్‌సీ వైపు జనం క్యూ కడుతున్నారు. మిగతాచోట్ల కొవిషీల్డ్‌ అందుబాటులో ఉన్న కారణంగా ఆ వ్యాక్సిన్‌ను కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అయితే వైద్య,ఆరోగ్యశాఖ మాత్రం రెండువ్యాక్సిన్‌లు ఒకే రీతిలో పని చేస్తాయని కొవ్యాక్సిన్‌, కొవిషీల్డ్‌లలో ఏదో ఒకటి మాత్రమే ఫస్ట్‌, సెకండ్‌ డోసులుగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

కనీస జాగ్రతల విస్మరణ

కాగా ప్రజలు ఇప్పటికీ కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. బస్సులు, మార్కెట్‌లు, సినిమాథియేటర్‌లు, షాపింగ్‌మాల్స్‌లో జనంగుంపులు గుం పులుగా సంచరిస్తున్న కారణంగా వైరస్‌వ్యాప్తి విసృతమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కొంత మంది మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ, ఎక్కువ మంది మాత్రం మాస్క్‌లను విస్మరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అలాగే భౌతికదూరం పాటించడం విషయంలో మాత్రం ఘోరమైన వైఫల్యం కొనసాగుతోందంటున్నారు. ఎక్కడ కూడా ప్రజలు భయపడకుండా తిరుగుతూ కరోనావ్యాప్తికి కారకులవుతున్నారన్న విమర్శలున్నాయి. వైద్య,ఆరోగ్యశాఖతో పాటు ఇతర అధికార యంత్రాంగమంతా కనీస జాగ్రత్తల విషయంలో విసృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇకనైనా కనీసజాగ్రత్తలు పాటించనట్లయితే ముప్పు మరింత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు. 

అప్రమత్తమవుతున్న అధికారులు

కాగా కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోంది. జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి సంబందిత యంత్రాంగానికి పకడ్భందీ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్య యంత్రాంగ మంతా అక్కడే తిష్ట వేసి కరోనా కట్టడిచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ కూడా తమ పరిధిలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతుండడమే కాకుం డా కరోనా టెస్టులను కూడా నిర్వహిస్తోంది. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ, సానిటైజర్‌లను ఉపయోగించాలని విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2021-04-10T06:39:30+05:30 IST