రాజుకుంటోంది!

ABN , First Publish Date - 2020-03-29T09:10:06+05:30 IST

ఏపీలో శనివారం బయటపడ్డ 6 కొత్త కేసుల్లో... నాలుగు ‘ఢిల్లీ’ ద్వారా వచ్చినవే. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి బావమరిది...

రాజుకుంటోంది!

  • కలకలం రేపుతున్న ‘ఢిల్లీ కనెక్షన్‌’
  • అక్కడి సమావేశానికి హాజరైన పలువురికి వైరస్‌
  • వారి ద్వారా కుటుంబ సభ్యులకూ!
  • మన 19లో 6 కేసులకు ఢిల్లీ మూలాలు
  • గుంటూరులో నాలుగు, ప్రకాశంలో రెండు! 
  • తెలంగాణలో ఏడెనిమిది కేసులతో లింకు
  • ఆ సదస్సుకు ఏపీ నుంచే 1500 మంది
  • బృందాలుగానే బస, రైలులో ప్రయాణం


ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. శనివారం ఒక్కరోజే ఏపీలో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ఎనిమిది మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వెరసి... ఏపీలో మొత్తం కేసులు 19కి చేరాయి. తెలంగాణలో ఈ సంఖ్య 67కు చేరింది. ఇరు రాష్ట్రాల వైద్యాధికారులను వణికిస్తున్న అంశమేమిటంటే... ఇప్పటిదాకా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో అనేక మంది ఈ నెల 14 నుంచి 18వ తేదీ మధ్య ఢిల్లీకి వెళ్లిన వారు, వారి ద్వారా (కాంటాక్ట్‌) వైరస్‌ సోకిన వారు ఉన్నారు. 


అమరావతి/హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఏపీలో శనివారం బయటపడ్డ 6 కొత్త కేసుల్లో... నాలుగు ‘ఢిల్లీ’ ద్వారా వచ్చినవే. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి బావమరిది 18 మందితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఒక మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకూ, ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరికి శనివారం ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయ్యింది. దీంతో... ఈ బృందం మొత్తానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి కుటుంబంతో పాటు మొత్తం 15 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇక... ఢిల్లీలో ఇదే సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడికీ... ఆయన భార్యకూ శనివారం  కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే తెలంగాణలో వచ్చిన కరోనా పాజిటివ్‌లలో పలు కేసులకు కూడా ‘ఢిల్లీ కనెక్షన్‌’ ఉన్నట్లు బయటపడింది.


నాంపల్లికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరై వచ్చారు. ఆయనతోపాటు కుటుంబంలో మొత్తం ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  హైదరాబాద్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు శనివారం మరణించారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కూడా ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి 17వ తేదీ తిరిగి వచ్చారు. అలాగే, ఢిల్లీలో అదే సమావేశానికి వెళ్లి వచ్చిన పాతబస్తీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికీ పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివల్లే ఏడెనిమిది మందికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలనైనా ఇళ్లకే పరిమితం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


వైద్యశాఖలో కలకలం...

ఈ కేసుల నేపథ్యంలో... వైద్యాధికారులకు ‘ఢిల్లీ ఫీవర్‌’ పట్టుకుంది. ఎందుకంటే... ఢిల్లీలో జరిగిన సదరు మతపర సమావేశానికి  దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. ఏపీ నుంచే దాదాపు 1500మంది వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువమందే వెళ్లి ఉంటారని అంచనా. ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఆ సమావేశానికి వెళ్లారు. చీరాల పరిసర గ్రామాల నుంచి 16 మంది వెళ్లినట్లు సమాచారం.


వీరిలో అనేక మంది సామూహికంగా రైళ్లలో ప్రయాణించారు. ఢిల్లీలో తమతమ బృందాలతో కలిసి ఒకే చోట బస చేశారు. కొందరు సొంత ప్రాంతాలకు వచ్చిన తర్వాత పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారు తిరిగి వచ్చాక ఎక్కడ బస చేశారు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హుటాహుటిన చీరాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 


Updated Date - 2020-03-29T09:10:06+05:30 IST