వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-07-23T07:50:37+05:30 IST

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలని ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌

ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 22 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలని ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు చిన్న పిల్లలు ముట్టుకోకుండా చూడాలని సూచించారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయినా రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్‌ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు. పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని, పాడుబడ్డ బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రత్యేక సేవలందించేందుకు పోలీస్‌ అధికారలు, సిబ్బంది అప్రమత్తం చేసి అందుబాటులో ఉండేలా ఆదేశించామన్నారు. ఆపత్కాలంలో ప్రజలు 100 నెంబర్‌కు గానీ వాట్సాప్‌ నెంబర్‌ 8333986939కు ఫోన్‌ చేసి తగిన సహయం పొందవచ్చునని పేర్కొన్నారు. వాహనాలు నడిపే వారు వర్షాలతో రోడ్లు ఇబ్బందికరంగా మారుతాయని, ప్రమాదాలకు లోను కాకుండా గమ్యస్థానం చేర్చాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు.


Updated Date - 2021-07-23T07:50:37+05:30 IST