Abn logo
Sep 25 2021 @ 23:39PM

నేను పోయిన నాడు ప్రజలు కంటతడి పెట్టాలి..

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

 - ప్రతి ఊర్లో పొలం గట్ల మీద నా గుర్తులుంటాయి

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

వీణవంక, సెప్టెంబరు 25: ‘నేను పోయిన నాడు నా ప్రజలు కంటతడి పెట్టాలనేలా బతుకుతున్న... ఎన్ని డబ్బులు సంపాదించానని కాదు.. ఎంత ప్రేమ సంపాదించాననేదే ముఖ్యం’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం వీణవంక మండలం మల్లన్నపల్లిలో యాదవ, ఇతర కులస్థులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ మిస్టర్‌ సీఎం తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు... బీజేపీలో ఉన్న వారికి దళితబంధు ఇవ్వను అంటున్నారట.. ఎలా ఇవ్వరో చూస్తానన్నారు. మంత్రయినా, ముఖ్యమంత్రయినా, ప్రధానమంత్రయినా ప్రజ లు కట్టే పన్నులకు కాపలదారులు మాత్రమే అన్నారు. కౌశిక్‌రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, అతడికి  ప్రగతి భవన్‌లో ఎంట్రీ దొరికింది తన రాజీనామా వల్లనేనన్నారు. ప్రతి ఊర్లో పొలం గట్ల మీద తన గుర్తులున్నాయన్నారు. వీణవంక మండల ప్రజలు వాగు పారించమని అడిగేవారని, దీనికి పరిష్కారంగా చెక్‌ డ్యామ్‌లు కట్టించి 365 రోజులు నీళ్లు పారిస్తున్నామన్నారు. ఇక్కడ తిరిగే నాయకులు వీణవంక వాగు వద్దకు వచ్చి మాట్లాడాలన్నారు. యావత్‌ తెలంగాణ ఇక్కడ అభివృద్ధిని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటుదన్నారు. తన ఇంటికి ఎవరన్నా వస్తే పార్టీ ఏంది..? కులం ఏంది అని ఎప్పుడు అడగలేదని, నీ బాధ ఏంది అని అడిగి అన్నంపెట్టి సాయం చేసి పంపిన్నానన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, సర్పంచ్‌లు బొబ్బల విజయ్‌కుమార్‌రెడ్డి, గాలేటి జ్యోతి సురేందర్‌రెడ్డి, మేకల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ మోరె స్వామి, నాయకులు బొబ్బల కరుణాకర్‌రెడ్డి, పుప్పాల రఘు, మారముల్ల కొంరయ్య, మోటం వెంకటేష్‌, గాజుల సమ్మయ్య, గెల్లు కుమార్‌, సత్యనారాయణ, పర్లపల్లి స్వామి పాల్గొన్నారు.

ఫ మా జోలికి వస్తే ఊరుకోం..

జమ్మికుంట రూరల్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అందరం ప్రశాంతంగా ఉంటామని, మా జోలికి వస్తే మాత్రం ఊరుకోమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఇక్కడ దౌర్జన్యం జరిగితే మొదట చిందేది తన రక్తపు బొట్టే అని అన్నారు. శనివారం మండలంలోని మడిపల్లి గ్రామంలో ఈటల రాజేందర్‌ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పెట్టినా, జైళ్లో పెట్టినా ముందు తనను పెట్టాలని, కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదన్నారు.  టీఆర్‌ఎస్‌ వాళ్లకి ఇక్కడ గెలువలేమని తెలిసిరా.. దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారని తెలిపారు. ఉప్పల్‌, జమ్మికుంట రైల్వే స్టేషన్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జైళ్లను, మానుకోట రక్తపు చుక్కను అడిగితే తన చరిత్ర చెబుతుంన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఎక్కడ ఓట్లు రాకపోయినా హుజూరాబాద్‌లో 57వేల మేజార్టీ ఇచ్చానని, ఆయన కూడ తనను రాజీనామా చేయమన్నారని తెలిపారు. తన రాజీనామతోనే అన్ని వచ్చాయని, అందరూ తన ఫొటో పెట్టుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.