కాలుష్యంతో సతమతం

ABN , First Publish Date - 2020-11-18T05:44:28+05:30 IST

పారిశ్రామిక ప్రాంతవాసులు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు పరిశ్రమలు రాత్రి వేళల్లో యథేచ్ఛగా కాలుష్యాన్ని విడిచిపెడతాయని జనం గగ్గోలు పెడుతున్నారు.

కాలుష్యంతో సతమతం
ఓ పరిశ్రమ చిమ్నీ నుంచి కాలుష్యం వెలువడుతున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

యథేచ్ఛగా విడిచి పెడుతున్న పరిశ్రమలు

శీతాకాలంలో రాత్రి వేళల్లో ఎక్కువగా విడుదల

ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు


మల్కాపురం, నవంబరు 17 : పారిశ్రామిక ప్రాంతవాసులు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు పరిశ్రమలు రాత్రి వేళల్లో యథేచ్ఛగా కాలుష్యాన్ని విడిచిపెడతాయని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ ఏడాది నవంబరు నెల మొదలైనప్పటి నుంచి ఘాటైన వాసన వెలువడే కాలుష్యాన్ని పలు పరిశ్రమలు విడిచిపెడుతున్నాయని, వీటిపై కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పరిశ్రమల యాజమాన్యాలు ఈ సీజన్‌లో విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడిచిపెడుతున్నాయని వారంతా వాపోతున్నారు. రాత్రి వేళల్లో మంచు కారణంగా కాలుష్యం పైకి వెళ్లదని, కిందనే ఉండడంతో ఉదయం వేళల్లో ఇళ్లల్లోకి వచ్చేస్తోందని చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి

ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకు ఈ ప్రాంతంలోని హెచ్‌పీసీఎల్‌, కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం, అల్లూఫ్లోరైడ్‌ కంపెనీ తదితర పరిశ్రమలు కాలుష్యాన్ని విడిచి పెడుతున్నాయని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఈ కాలుష్యం వల్ల ముఖ్యంగా ములగాడ, ఎదురువానిపాలెం, చినములగాడ, గొందేశివానిపాలెం, కుంచమ్మకాలనీ, శ్రీరామ్‌నగర్‌, పిలకవానిపాలెం, శ్రీహరిపురం, రామ్‌నగర్‌, కుంచమాంబ కాలనీ, కోడిపందెల దిబ్బ, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతాల వాసులు సతమతమవుతున్నారు. కాలుష్యం విడిచి పెట్టినప్పుడు కుళ్లిన కోడిగుడ్డు వాసన వస్తోందని, దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు స్పందించి కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-11-18T05:44:28+05:30 IST