కరోనా కాలం..చికిత్సకు భయం

ABN , First Publish Date - 2020-07-10T10:55:02+05:30 IST

జలుబు, జ్వరం, తలనొప్పి ఇలా ఏ అనారోగ్య సమస్య వచ్చి నా చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళేందుకు ప్రజలు జంకుతున్నారు.

కరోనా కాలం..చికిత్సకు భయం

అనారోగ్యంతో సతమతమవుతున్న ప్రజలు

ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానాల్లోకి వెళ్ళడానికి జంకుతున్న రోగులు

బయటి నుంచి వచ్చిన వారితో జిల్లాలో 18 మందికి సోకిన కరోనా వైరస్‌ 

హైదరాబాద్‌ వెళ్ళాలంటేనే భయం

(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల) 

జలుబు, జ్వరం, తలనొప్పి ఇలా ఏ అనారోగ్య సమస్య వచ్చి నా చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళేందుకు ప్రజలు జంకుతున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున వ్యాధి ఎలా సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాలలోని నర్సింగ్‌హోంలలో ఒక వైద్యుడికి, మరో నర్సింగ్‌హోంలో చికిత్స పొందిన రోగికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ రెండింటిని అధికారులు మూసివేశారు. ఆసుపత్రులకు పలు రకాల వ్యాధులతో రోగులు వస్తున్నందున వ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో శ్రీరాంపూర్‌కు చెందిన యువకుడు మరణించాడు. 


ఇతను హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా మూడు రోజుల క్రితం పరీక్షలో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. బుధవారం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. 


 గతంలో ఒకరిద్దరికి హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్ళగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు.  ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలోనూ, ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇతర చికి త్సల కోసం వెళ్ళే పరిస్థితి లేదు.  చెన్నూర్‌లోని ముత్తరావుపల్లిలో అనారో గ్యానికి గురైన మహిళ హైదరాబాద్‌లోని కోఠి ఆసుప త్రికి వెళ్ళగా అక్కడ ఆమె మరణించింది. మరణించిన అనంతరం ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. బెల్లంపల్లికి చెందిన మహిళ గోదావరిఖనిలో చికిత్స పొందింది.


అక్కడ వైద్యుడికి రావడంతో రోగులను ఇంటింటికి పంపించారు. ఆమె కూడా మరణించిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సంఘటనలతో ఇతర వ్యాధులకు చికిత్స పొందడానికి  దవాఖానాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్ని స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ గడిచిన కొద్ది రోజులుగా వైరస్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు, నాయకులు హైదరాబాద్‌ చికిత్స కోసం వెళ్ళగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌కు చికిత్స కోసం, అక్కడ విధులు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన 18 మందికి పాజిటివ్‌గా తేలింది. మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఆరోగ్య, వైద్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  


కరోనాతో యువకుని మృతి. 

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కరోనాతో గురువారం  మృతి చెందాడు.  గాంధీనగర్‌కు చెందిన ఓ యువకుని పై   మే 15న ముగ్గురు యువకులు దాడి చేసి గాయపరిచారు. కరీంనగర్‌లో నెల రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం  హైదరాబాద్‌  నిమ్స్‌కు తరలించారు. 15 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న యువకునికి మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండడంతో బుధవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొడుకు బాగుపడాలని లక్షలు వెచ్చించామని, కోలుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి కబళించిందని కుటుంబ సభ్యులు వాపోయారు. యువకుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


జిల్లాలో మరో పాజిటివ్‌ కేసు

మంచిర్యాల అర్బన్‌ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక  పాజిటివ్‌ కేసు నమోదైంది. బుధవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తోళ్ళవాగు సమీప నివాసితో వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్‌ అని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు.  జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 154కు చేరాయి. మరో 22 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 

Updated Date - 2020-07-10T10:55:02+05:30 IST